Friday, July 25, 2014

ప్రయివేటు వ్యవస్థను ప్రోత్సహిస్తే... ?

        అరవై ఏళ్ళ కల సాకారం అయినవేళ.. తెలంగాణలో ప్రతి గుండె సంబురపడింది. రాష్ర్టమెలాగూ ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ అనుకూల, అననుకూల(వ్యతిరేక కాదు) వాదులందరూ బంగారు తెలంగాణను నిర్మించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాధులపై ఏర్పడిన తొలి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల వేళ హామీల సునామీలు పోటేత్తినా.. వాటి అమలు గురించి ఇప్పుడే చర్చించుకోవడం తొందరపాటే అవుతుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, పోకడ మాత్రం ఒక్కోసారి ఆందోళన కలిగిస్తోంది. రుణమాఫీ, ఫీజు రియింబర్స్ మెంట్, బ్రాండ్ అంబాసిడర్ గా సానియామిర్జా నియామకం, పలు ఛానళ్ల ప్రసారాలపై పరోక్ష పెత్తనం.. తదితర అంశాలు ఇవాళ రాష్ర్టంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఏ ముగ్గురు కలిసినా.. వీటిలో ఎదో ఒకటి చర్చించుకోవటం కనిపిస్తుంది. అన్నీ వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏదో ఒక విధంగా రుణమాఫీ అమలు చేయడం ఖాయంగా తెలుస్తోంది. అయితే 1956 ముందు తెలంగాణలో ఉన్నవారి కుటుంబాలకే ఫీజు రియింబర్స్ మెంట్ అంటూ మెలకపెట్టడం కొంత వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది. తెలంగాణ బిడ్డలకే రియింబర్స్ మెంటు సదుపాయం అందించాలన్న ఉద్దేశం స్వాగతించాల్సిందే. అయితే ఆ పేరుతో 1956ను మూల సంవత్సరంగా తెరపైకి తీసుకరావడం సమంజసం కాదు.  వాస్తవానికి 1956కి ముందు ప్రస్తుత మునగాల పరగణా, భద్రాచలం ప్రాంతాలు తెలంగాణలో లేవు. వాటి గురించి చర్చించకుండా ఏకపక్షంగా 1956ను ప్రామాణికంగా తీసుకోవడమే సమస్య. ఓ వైపు పోలవరం ముంపు ప్రాంతాలను అక్రమంగా కలుపుకున్నారని పక్క రాష్ర్టంపై దుమ్మెత్తిపోస్తూ... న్యాయపరంగా పోరాడతామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అదే ప్రాంతాల విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ కల్పించే విషయం తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
          ఇక అసలు విషయానికొద్దాం. తెలంగాణ శాసనసభ, సభ్యులను కించపరుస్తూ ఓ ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమం నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. చర్య తీసుకోకుండా ఉపేక్షించజాలని విషయం. అయితే ఏ చర్య తీసుకున్నా చట్టరిత్యా ప్రభుత్వ పరంగానో లేక శాసనసభా అధికారాలను ఉపయోగించి తీసుకొని ఉంటే హుందాగా ఉండేది. చర్య తీసుకునే నెపంతో ప్రయివేటు వ్యవస్థను ప్రోత్సహించడం సమంజసం కాదు. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవడం అవసరం. నిండు సభలో ఒక ఛానల్ సభను, సభ్యులను కించపరుస్తూ కార్యక్రమాన్ని ప్రసారం చేసిందని సాక్షాత్తు సిఎం ప్రకటించారు. మరి అలాంటపుడు ఆ కార్యక్రమానికి సంబంధం లేని మరో ఛానల్ ప్రసారాలను ఎందుకు నిలిపివేయించారు? దాదాపు 50 రోజులుగా రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిచిపోవడం.. అది ప్రయివేటు వ్యవస్థ ద్వారా కావడం నిజంగా ప్రభుత్వానికే సిగ్గుచేటు. ప్రయివేటు ఆపరేటర్లు నియంత్రించలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పరిణామం కేవలం రెండు ఛానళ్ళకు మాత్రమే పరిమితం అవుతుందనుకోవడం పొరపాటు. ఒక్కసారి వ్యవస్థను నియంత్రించడం అలవాటయ్యాక ఉరికనే ఉంటారనుకోవడం మన అమాయకత్వం. రేపు మరో ఛానల్ ఏదేని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ప్రసారం చేసినా.. దాదాపు ఇటువంటి చర్యే ఉండే అవకాశం ఉండదని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల దాకా ఎందుకు? ఏదేని ఎంఎస్ వో పైన కథనం ప్రసారం చేయాలన్న ఛానళ్ళు భయపడే పరిస్థితి నేటి ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. ఇది చివరకు ఎంతవరకు వెళ్తుందో అన్నదే ఆంధోళన కలిగించే విషయం. బహుశా తమ ప్రాంతాన్ని కవర్ చేసే రిపోర్టర్ తో పొసగకపోయినా.. అతన్ని మార్చకపోతే ఛానల్ ప్రసారం ఆపివేస్తామంటే  ఛానల్ యాజమాన్యం కచ్చితంగా సంబంధిత రిపోర్టర్ ను మార్చాల్సి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇది ఒకటి, రెండు ఛానళ్లకు సంబంధించిన విషయంగా ఇప్పుడు మిగతా ఛానళ్లు భావిస్తున్నాయి. భవిష్యత్తులో తమ ఛానల్ లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేయకుండా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయేమో వేచిచూడాల్సిందే.

No comments:

Post a Comment