Saturday, February 9, 2013

శ్రీశ్రీ మహాప్రాస్థానం నుంచి ఓ కవిత

చిరకాలం జరిగిన మోసం ,
బలవంతుల దౌర్జన్యాలూ ,
ధనవంతుల పన్నాగాలు
ఇంకానా ! ఇకపై చెల్లవు .

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ ,
ఒక జాతిని వేరొక జాతీ ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదు .

చీనాలో రిక్షావాలా ,
చెక్ దేశపు గని పనిమనిషీ ,
ఐర్లాండున ఓడ కళాసీ ,
అణగారిన ఆర్తులందరూ ____

హటెన్ టాట్ , జూలూ , నీగ్రో ,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యథార్థ తత్వం
చాటిస్తా రొక గొంతుకతో .

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?
తారీఖులు , దస్తావేజులు
ఇవి కావోయి చరిత్రకర్థం .

ఈ రాణి ప్రేమ పురాణం ,
ఆ ముట్టడికైన ఖర్చులూ ,
మతలబులూ , కైఫీయతులూ
ఇవి కావొయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .

నైలునది నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి
రాల్లెత్తిన కూలీలెవ్వరు ?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహస మెట్టిది ?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ ,
అది మోసిన బోయీ లెవ్వరు ?

తక్షశిలా , పాటలీపుత్రం ,
మధ్యదరా సముద్రతీరం ,
హరప్పా , మొహెంజొదారో
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో __

చారిత్రక విభాతసంధ్యల
మానవకథ వికాసమెట్టిది ?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం ?

ఏ శిల్పం ? ఏ సాహిత్యం ?
ఏ శాస్త్రం ? ఏ గాంధర్వం ?
ఏ వెల్గుల కీ ప్రస్థానం ?
ఏ స్వప్నం ?  ఏ దిగ్విజయం ?

(ఓ స్టోరీ గురించి వెదుకుతుంటే యథాలాపంగా ఈ కవిత నాకు కనిపించింది. పంచుకోవాలనిపించి పబ్లిష్ చేస్తున్నాను)