Friday, December 28, 2012

యువ చైతన్యం


       దేశ రాజదాని ఢిల్లీలో గత వారం జరిగిన సంఘటన దేశంలో మహిళల దుస్థితి ఎంత దుర్భరంగా ఉందో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వ, రాజ్యాంగ యంత్రాంగాల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీ యువత స్పందన యావత్ దేశాన్ని అబ్బురపరిచింది. ఎప్పుడు పబ్బులు, ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఢిల్లీ యువతరం ఒక సంఘటనపై స్వచ్ఛందంగా రొడ్డెక్కడం, అందునా హై సెక్యూరిటీ జోన్ గా భావించే రాజ్ పథ్, విజయ్ చౌక్, రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో వేలాదిగా గుమిగూడి నిరసనకు దిగడం ఆశ్చర్యం కలిగించింది. వారి ధైర్యానికి, చొరవకు అభినందనలు. సాధారణంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, విజయ్ చౌక్ ప్రాంతాలలో గుంపులు గుంపులుగా ప్రజలను తిరగనివ్వరు. ఢిల్లీలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ ను వదిలి హై సెక్యూరిటీ ప్రాంతాన్ని ఆందోళనకు ఎంచుకోవడం యువతలోని తెగింపును తెలుపుతుంది. వాటర్ కానన్లు, బాష్పవాయువులు అలవాటు లేకున్నా వాటికి భయపడకుండా ఉద్యమకారుల స్పూర్తిని చాటారు. ఇప్పటికైనా పాలకులు యువతలోని ఆగ్రహా జ్వాలలను గుర్తించి, ఆందోళన ఉదృతం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలి. హామీలతో సరిపెట్టకుండా అమలుకు చిత్తశుద్దితో కృషిచేయాలి. మహిళలను తాకాలంటేనే భయపడేలా శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇటువంటి అకృత్యాలకు ఎంతోకొంత బ్రేక్ పడే అవకాశం ఉంది.
      ఇక విచారం కలిగించే విషయం ఏమంటే... ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన మెడి"కో' గురించి ఇక్కడి వైద్యవిద్యార్థులు ఎవరూ స్పందించకపోవడం. మెస్ ఛార్జీల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో విధులు తప్పనిసరిని వ్యతిరేకిస్తూ పేషంట్ల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గాంధీ విద్యార్థులకు ఈ సంఘటన కనిపించలేదా? కనీసం ఖండించేందుకు కూడా మనసు రాలేదు. తమ తోటి వైద్య విద్యార్థినిపై జరిగిన అకృత్యం యావత్ దేశాన్ని ఉడికిస్తుంటే... రాష్ట్ర వైద్య విద్యార్థులు మాత్రం సిగ్గు, శరం లేకుండా తమ పని చూసుకుంటున్నారు.

Friday, December 7, 2012

తెలంగాణ... పేరే కావాలి???

           తెలంగాణ ఐకాన్... వీరవనిత... తెలంగాణ తూర్పుముక్క.... ఇలాంటి మాటలు ఎన్నో.... ఫేస్ బుక్ లో తెలంగాణ వాదుల వీర ఫాలోయింగ్... విపరీతమైన కామెంట్లు... న్యూస్ రీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవార్డులను తొలిసారి అందుకున్న సదరు యాంకర్  అప్పటి వరకు ఎంతమందికి తెలుసో కానీ... అవార్డు వచ్చిన తర్వాత మాత్రం పైన చెప్పిన హంగామాతో తెలంగాణలో ఆమెకు విపరీత ప్రచారం కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లు... టీవీలు, పేపర్లో యాడ్స్... జనాలకు ఇంత వేలం వెర్రి ఎందుకో అర్థం కాలేదు. ఎదో.. స్టేజీ మీద రెండు మాటలు మాట్లాడగానే ఆమెలో కొంతమందికి వీరతెలంగాణం కనిపించింది. తీరా ఇప్పుడు చూస్తే... తెలంగాణవాదం పక్కన పెట్టిన ఆమె రెడ్ల పార్టీలో చేరారు. ఆమెను ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో? తెలంగాణవాదం కన్న కులానికి, ఇతర అంశాలకు ప్రాధాన్యమిచ్చిన ఆ వనిత ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం శోచనీయం. పార్లమెంటులో సమైక్యాంద్ర ప్లకార్డును ప్రదర్శించిన జగన్ పార్టీ సరసన చేరిన ఆమె... తన రాజకీయారంగేట్రం తెలంగాణ కోసమేనంటే నమ్మే వెర్రి వాళ్ళు ఈ తెలంగాణలో ఎవడూ లేరు. ఇంకా నమ్మితే గొర్రే కసాయోన్ని నమ్మినట్లే. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. నిన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇవాళ ఆమె, రేపు ఇంకొకరు... ఇలా అందరూ తెలంగాణ వాదాన్ని వాడుకున్నది.. వాడుకుంటున్నది... తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ కోసం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేయాలన్న పదవి కాంక్ష, ఆర్థిక ప్రయోజనాల కోసం సదరు యాంకర్ తెలంగాణావాదాన్ని తాకట్టు పెట్టారు. రేపు మళ్ళీ తెలంగాణ పేరుతోనే ఓట్లు అడగడానికి లో ఎటువంటి సంకోచం లేకుండా వస్తారు. 
          ఈ విషయాన్ని అమాయకులైన మా తెలంగాణ సోదరులు గుర్తించనంత కాలం ప్రతివాడు తెలంగాణ జెండా ఎత్తుకొని పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఐపిఎస్ గిరిని వదులుకున్నా... అన్నీ సొంత లాభాలకేనన్నది వాస్తవం. గీడ నిజమైన తెలంగాణ వాదులు ప్రజలే.. నాయకులు కాదు.. అందుకే తెలంగాణ పేరుతో పోటీ చేసే వారు ఓడిపోతే తెలంగాణవాదం ఎక్కడ వెనకపడి పోతుందోనన్న ఆందోళనతో వారి పుట్టుపుర్వోత్తరాలు చూడకుండా గెలిపించుతున్నరు. గెలిచిన వారు మాత్రం ప్రజల ఆకాంక్షను పక్కకు పెట్టి ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నరు. ఈ ప్రపంచంలో స్వార్థం లేనివాడు ఎవ్వడూ లేడు. ప్రతివాడికి ఎదో రూపంలో స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే భయటికి మాత్రం వీర ఫోజులు పెట్టడమే బాధాకరం. తెలంగాణ పేరుతో వంచించబడుతోన్న ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలి. ఎవ్వనికిబడితే వాడికి తెలంగాణవాదాన్ని అన్వయించుకోవద్దని మనవి.

Monday, September 10, 2012

మళ్లీ నా చేతికొచ్చిందోచ్

            కొంత మంది మిత్రులం కలిసి ఎంతో మంచి ఆశయం కోసం ఈ బ్లాగును ప్రారంభించాము. కాని అందరివి మధ్య తరగతి బతుకులేనాయే. అందుకే ఎవ్వరం దీని మీద సరిగా ద్రుష్టి పెట్టలేక పోయాం. రెగ్యులర్గా అప్డేట్ చేయలేక పొయాం. అందరి చేతులు మారుతూ మళ్లీ నా చేతికి వచ్చింది. ఇక నుంచైనా రెగ్యులర్గా అప్డేట్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఆశీస్తున్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి.
..... మీ చందు          

Saturday, May 19, 2012

సంస్మరణ సరే... ఆచరణ మాటేమిటి?


   కమ్యూనిస్ట్ యోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) మూలపురుషుల్లో ఒకరైన పుచ్చలపల్లి  సుందరయ్య శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజానేతకు స్మరించుకునేందుకు అంతకన్నా ఎక్కువ  చేసిన తప్పు లేదు. ఎందుకంటే వున్నత కుటుంబములో పుట్టినా పేదల కోసం ఉద్యమించారు. మచ్చ లేని నేతగా నిలిచారు. నిస్వార్దంగా సామాన్య జీవితం గడిపారు ఆ మహానేత.
      అయితే శతజయంతి ఉత్సవాల పేరుతో ఆ మహానుభావున్ని స్మరించుకుంటే సరిపోతుందా? అయన చూపించిన మార్గం అవసరం లేదా అనేది నేటి నేతలు ఆలోచించుకోవాలి. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్నా సైకిల్ మీదనే సభకు వెళ్లారు పిఎస్ (సుందరయ్య గారిని ఇష్టంగా పిలుచుకునే పేరు). కాని నేటి ఆ పార్టీ నేతలు అడంబరాలలో భుర్జువా పార్టీల నేతలతో పోటి పడుతున్నారు. ఎసి వాహనాలు లేకుంటే బయట కాలు కూడా పెట్టలేకపోతున్నారు. తమ కింది క్యాడర్ లో కూడా  అటువంటి లక్షణాలు ఉన్నవారిని మాత్రమే నేటి నేతలు గుర్తిస్తున్నారు. బయటి కార్యక్రమాలకు వారితోనే వెళ్తున్నారు. పేద కార్యకర్తల ఇంటివైపు కూడా చూడడం లేదు.  స్వార్ధం పెరుగుతుందేమో అన్న భావనతో సంతానమే వద్దనుకున్నారు పిఎస్. కానీ అయినవారు, తమ ప్రాంతం వారినే అందలమేక్కియడం, వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం నేడు రివాజుగా మారింది. ప్రశ్నించే వారిని కమిట్మెంట్ లేని వారిగా ప్రచారం చేస్తూ, పైపైన తిరుగుతూ పై బాధ్యుల వద్ద చెంచాగిరి చేసేవారిని వీర యోధులుగా గుర్తిస్తున్నారు. పార్టీ, ప్రజాసంఘాలు, అనుబంధ సంస్థలలోనూ ఈ వ్యాది విస్తరించి వుంది. ఉద్యమానికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన వారు తిరిగి కీలక బాధ్యతల్లోకి వస్తున్నారు. ఆర్దికంగా, ఇతర  ఇబ్బందులు ఎదురైనా   దీర్గాకాలంగా ఉద్యమాన్ని అంటిపెట్టుకున్న వారిని చిన్నచూపు చుస్తున్నారనే విమర్శ ప్రతి స్తాయిల్లోను వుందని ఆ సంస్తల్లో పనిచేస్తున్న మిత్రులే స్వయంగా చెబుతున్నారు. అయితే అందరు నేతలు అలానే వున్నారని అనలేము. కాని మెజార్టీ నేతలు మాత్రం కచ్చితంగా అలానే వున్నారు.
       అయితే ప్రస్తుత  రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును ఇందులో  మినహాహింపునివ్వొచ్చు. ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితం గడుపుతారు. అయన మీద ఎన్ని విమర్శలు వున్నా దగ్గర నుండి ఆయనను ఎరిగిన వారికి ఆదర్శ నేతగా నిలుస్తారనడంలో  సందేహం ఉండకపోవచ్చని భావిస్తున్నాను. తరువాతి నేతలు కూడా ఆయన్ను అనుసరిస్తే ఆ మహానుభావుని ఆశయం కొంతైనా నెరవేరుతుంది.
          తమకు చెంచాగిరి చేసే లేదంటే పై స్తాయిల్లో పలుకుబడి ఉన్నవారికే పార్టీలో, ప్రజాసంఘాల్లో, పార్టీ అనుబంధ సంస్త లలో  గుర్తింపు లభిస్తుందని, అటువంటి వారికే పదోన్నతులు లభిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విమర్సలకు మార్క్సిస్టులు ఏనాడు భయపడరు. కనీసం స్పందించరు. పాలకులపై అలుపులేని పోరాటాలు నిర్వహిస్తున్న వారిపై స్వార్ద శక్తులు విమర్శలకు దిగుతున్న నేపద్యంలో ఆ విదానం కరక్టే. కాని వాస్తవ   విమర్శలను పట్టించుకోకపోతే కింది స్తాయి క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారు. తెలిసో, తెలియకో జరుగుతున్న అటువంటి చర్యలపై పై నాయకత్వం ఆరా తీయిస్తే పార్టీకే మంచిది. చివరగా ఒక విజ్ఞప్తి.. ప్రతిభ, కమిట్మెంట్ ఉన్నవారిని గుర్తించకున్నా పెద్ద నష్టం లేదు. కానీ అది లేని వారిని తీసుకవచ్చి కీలక స్తానాల్లో కూర్చోబెట్టడం వల్ల ఆ సంస్థ అభివృద్దికి తీవ్ర ఆటంకంగా నిలుస్తుందని గుర్తించాలి. లేదంటే అంతా అయ్యాక మరోసారి 'దిద్దుబాటు' చేయాల్సి వస్తుంది. ఆ మహనీయుని దార్సనికతను, నాయకత్వ సామర్ధ్యాన్ని కనీసం ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకొని, మహాసభల్లో నిర్ణయించినట్లుగా స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు నాయకత్వం పనిచేయాలి. ఆ పనిలో నాలాంటి వారు ఎప్పుడు నూలు పోగుగా సహాయపడతారు.

Wednesday, March 14, 2012

'తృణమూల్' రాజకీయం

నవ్వితే నాకేటి సిగ్గు అనుకున్నాడట ఎనకటికొకాయన. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్స్ నేతలు కూద అలాగే వ్యవహరిస్తున్నారు. బెంగాల్ లో జరిగే ప్రతి నేర ఘటనను నిస్సిగ్గుగా సిపిఎంకు ఆపాదించే ఆ పార్టీ ఇప్పుడు రైల్ చార్జీల పెంపును వేరే వాళ్లకు ఆపాదిస్తుంది. రైల్ చార్జీలు పెంచిన పెంపును ఉపసమ్హరిణ్చుకొవాలని, లేదంటే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తృణమూల్ సొంత పార్టీకి చేందిన మంత్రిని తామే తొలగించవచ్చుగా... కేవలం ప్రజలను మోసం చేయడానికి దొంగ ప్రకటనలు చేస్తుంది. ... ఇంకో విషయమేమంటే ఐసియు లో వున్న రైల్వే ను గాడిలోకి తెచ్చానని  రైల్వే మంత్రి పేర్కొన్నారు. అంటే గత రైల్వె మంత్రి మమత బెనర్జీ రైల్వేను ఐసియు కు చేర్చారని సొంత మంత్రే వక్యానించడం గమనించదగిన విషయం.

Friday, December 30, 2011

ఇక సెలవు...

భారతోద్యమంలో నూతన చరిత్ర
లోక్‌పాల్‌కై కదిలిన యువ జనత
క్రోని క్యాపటలిజంపై సామాన్యుని శంఖారావం
అగ్రరాజ్యాన్ని వణికించిన వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం
ఉత్తేజం నింపిన టునీసియా విప్లవం

దేశ చరిత్రలో కళంకిత సంవత్సరం
అవినీతి ఊభిలో కేంద్ర ప్రభుత్వం
తిహార్‌ జైల్లో అమాత్యుల జీవనం
ఉచలను లెక్కిస్తున్న అక్రమ ఘనస్వామ్యం

ఆగిపోయిన సృజనాత్మక కలం
ఎంఎఫ్‌ హుస్సేన్‌ మరణం
అణు విపత్తుకు ప్రత్యక్ష సాక్ష్యం
ఫుకుషిమా దాయిచి దారుణం

విషప్రచారపు సునామీలో
కూలిన వామపక్ష దుర్గం
కామ్రేడ్లు లేని రైటర్స్‌ భవనం
నివ్వెరబోయిన ప్రజాతంత్ర సమూహం

నియంతో, నిందితుడో..
అమెరికాను ఎదిరించిన వీరుడు
నాటో పేర అగ్రరాజ్యం సాగించిన
అమానవీయ దమనకాండలో గఢాఫీ మరణం

28 ఏళ్ళ క్రికెట్‌ అభిమానుల స్వప్నం
జగజ్జేతగా భారత్‌ను నిలిపిన సంవత్సరం
వెలుగులోకొచ్చిన అగ్రరాజ్య రహస్యాధికారం
స్పూర్తి నింపిన అసాంజే విరోచితం

ఎన్నో చేదు జ్ఞాపకాల సమూహారం
మరవలేని విషాదాల సమూహం
అయినా కొన్నింటిలో విజయ పదం
రెండు వేల పదకొండా
నీకిక సెలవు...

Thursday, September 15, 2011

పేదవారంటే పాలకులకెందుకీ వివక్ష

ఎనకటికి ఎవరో ఎదో అన్నట్లు కోట్లాది రూపాయలను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న బడాబాబులకు క్షమాభిక్ష ప్రసాధించడానికి సిద్దపడ్డ కషాయి కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యుడిని మాత్రం అందినకాడికి పీల్చుకోడానికి కర్కశంగా వ్యవహరిస్తుంది. పెట్రో సంస్థల ఒత్తిడికి తలొగ్గి పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తివేసి మూడోచ్చినప్పుడల్లా రేట్లు పెంచుకోటానికి వారికి విశృంఖల స్వేచ్ఛనిచ్చింది. పేదవారు, సామాన్యులు, మధ్యతరగతి వారంటేనే ఈ ప్రభుత్వానికి చివుక్కుమంటుంది. అందుకే వరుసబెట్టి భారాలు వేస్తుంది. రాయితీపై ఇవ్వాల్సిన గ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను కుదించేందుకు కుట్ర పన్నుతోంది. ద్విచక్ర వాహనం ఉన్నా వారికి రాయితీ ధరపై గ్యాస్‌ అందించకుండా ఉండేందుకు పన్నాగాలు తయారుచేస్తుంది. ఈ రోజుల్లో ద్విచక్ర వాహనం లేకుండా ఎవరైనా ఉంటున్నారు. మూడు నాలుగు వేలు జీతాలొచ్చే మార్కెటింగ్‌ ఉద్యోగం చేయాలన్నా ద్విచక్ర వాహనం తప్పనిసరైన నేపథ్యంలో అప్పోసొప్పో చేసి ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులేదుర్కొంటున్నప్పటికీ ద్విచక్ర వాహనాలు కొనాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి సాకుల కోసం వెతకుతున్న కసాయి పాలకులు ఎప్పుడు దొరుకుతారా అందుకుందాం అని ఎదురుచూస్తున్నారు. అసలు మనిషి రక్తం తాగడం లాంటి ఏమైనా పథకాలుంటే ఈ పాలకులు రోజుకొక్క పేదవాణ్ణి ఇంటికి తీసికెళ్లి అతనిలోని నరనరంలోని రక్తాన్ని చివరిబొట్టు వరకు పీలుస్తారనడంలో ఎవరికైనా సందేహం ఉండకపోవచ్చు. ఇంతటి తీవ్ర విమర్శ చేయడానికి మనసు రాకపోయినా వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఇది చాలా తక్కువేమోనని అనిపిస్తుంది. ఓ పేదవాడు గూడుకోసం ఓ జానెడు చోటు ఇవ్వమంటే లాఠిలతో తరుముతారు. కానీ కార్పొరేట్లకు ఎకరాలకు ఎకరాలు అప్పజెప్పుతారు. ప్రభుత్వ పథకాలను కిందిస్థాయ వరకు తీసుకుపోవడంలో కీలక పాత్రం పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారికి సహకరిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు తీర్చాలనో ఓ వెయ్యి రూపాయలు వేతనాలు పెంచాలనో నిరసన వ్యక్తం చేస్తే వారి గొంతుకలపై తుపాకి కుత్తుకలను పెడుతున్నారు. వేసుకున్న చొక్కా నలగకుండా కూర్చోని ప్రజాసంక్షేమాన్ని తాట్టుపెట్టే చట్టసభల ప్రతినిధులకు మాత్రం లక్షలకు లక్షలు ముట్టజెబుతున్నారు. కామందుల కావరానికి రోజుకొక అబల బలవుతున్నా, ప్రభుత్వ రోడ్ల పుణ్యమాని పదుల సంఖ్యలో ప్రమాధాల బారిన పడి మరణిస్తున్నా పట్టించుకోవడానికి తీరికుండదు. కానీ ఓ ఎంపి కొడుకో, ఎమ్మెల్యే కొడుకో అతి వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి గురయితే మాత్రం అధికార పక్షం, ప్రతిపక్షం అంతా కదులుతుంది. చివరకు నిబందనలు కూడా మారుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిచోటా ఉన్నవారు, లేనివారు అనే బేధాన్ని పాలకులు భాగా ఒంటపట్టించుకుంటున్నారు. ఓటుకు వచ్చిన నాడు చేసిన బాసలను పాతిపెట్టి గెలిపించిన వారి వెన్నులో బాకులు దించుతున్నారు.
ఇంత జరుగుతున్నా కార్పొరేటు మీడియాకు ఇవేమీ పట్టవు. కార్పొరేట్ల మద్దతుతో చేపట్టే దీక్షలకు ఇచ్చే ప్రచారంలో ఒక్క శాతం కూడా పేదల పోరాటాలకు ఇవ్వడానికి వారికి మనసు రాదు. అది భూపోరాటమయినా, అటవీ హక్కుల పోరాటమయినా, ఆఖరికి సొంత భూమని రక్షించుకునే పోరాటమయినా మీడియా దయచూపదు. ఆఖరికి మహిళలపై ఖాకీలు కర్కశత్వానికి పాల్పడుతున్నా ప్రశ్నించదు. ఓ బడాబాబుకు వెన్నుపూసలో శస్త్రచికిత్సలో జరిగినా, బాత్రూంలో జారిపడినా ఓ పది రోజులు అదే ప్రధాన వార్త అవుతుంది. ఇది మన కార్పొరేటు మీడియా నగ్న స్వరూపం.
ఇక తమ నాయకునిపై సిబిఐ విచారణ జరుగుతుందనో, తమకు అడిగిన శాఖా ఇవ్వలేదనో, ఇంకా ఎదో కారణంతో తమ పదవులను తృణపాయంగా వదులుకుంటున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న చట్టసభల ప్రతినిధులు ప్రజల సమస్యలపై మాత్రం బెదిరింపులకు పాల్పడరు. ఎదో ఓ ఖండన ఇవ్వటమో, దిష్టిబొమ్మ తగలబెట్టడమో, లేదంటే కొద్దిసేపు రోడ్డు మీద కుర్చోవడమో చేస్తున్నారు. కానీ చట్టసభల వేదికలపై ఎంతమందిని ప్రజాసమస్యలను లేవనెత్తుతున్నారు? మనదేశ పార్లమెంటులో కనీసం సగం మందికి పైగా ఇంతవరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదంటే మనం ఎటువంటి వారిని సభకు ఎన్నుకోంటున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవినీతి మరక పడని పార్టీలు వీటిపై నిలదీసినా వాటికి మీడియా ప్రచారం మాత్రం రాదు. అసలు అటువంటి సభ్యుల ప్రాతినిధ్యం ఎక్కడ పెరుగుతుందోనని కంగారు కార్పొరేటు మీడియాలో ఎప్పూడూ ఉంటుంది. ఎందుకంటే చిత్తశుద్ది ఉన్న వారంతా మాట్లాడేది విధానాలపై కాబట్టి. అవినీతి వ్యతిరేక ఉద్యమాలు జరిగితే ఆ మీడియా మద్దతునిచ్చింది చిత్తశుద్దితో కాదు. చిత్తశుద్ది ఉన్నట్లయితే విధానాల మార్పుపై మాట మాత్రం మాట్లాడని సామాజిక కార్యకర్తలను ఒక్కమారైనా ప్రశ్నించేవి. ఇన్ని ఆటంకాలను దాటుకొని పేదవారి వేదన ముందుకు ఎలా సాగుతుంది. ఆరణ్య రోదన గానే మిగిలిపోవడం తప్ప. మీడియా కళ్లకు కానరాని, వినరాని పేదల, మధ్యతరగతి ఆవేదనను ఒక్కసారి ఆలోచించాలని ఓ చిన్న విజ్ఞప్తి. ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో ప్రభావితం కానప్పుడు వ్యర్థమేనని గుర్తుంచుకొని ఒక్క సారి ఆలోచించాలని విజ్ఞప్తి.