Friday, June 10, 2011

ఆగిన కుంచెకు చిత్ర నివాళి












'పికాసో ఆఫ్‌ ఇండియా' ఇకలేరు

చిన్నబోయిన కుంచె

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రముఖ భారతీయ చిత్రకారుడు మక్బూల్‌ ఫిదా (ఎంఎఫ్‌) హుస్సేన్‌ (95) గురువారం వేవవజామున 2.30 గంటలకు లండన్‌లో రాయల్‌ బ్రాంప్టన్‌ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. భారతీయ చిత్ర కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను తెచ్చిన ఎంఎఫ్‌ ఎందరో చిత్రకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. సావోపోలోలో జరిగిన ద్వైవార్షిక ూత్సవాల్లో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసోతో పాటు హుస్సేన్‌ కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. తరువాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఆయనకు 'పికాసో ఆఫ్‌ ఇండియా' బిరుదును ప్రదానం చేసింది. సృజనాత్మక కళాకారుడిగా పేరొందిన హుస్సేన్‌ హక్కులను భారత్‌లోని కొన్ని చాంధసవాద సంస్థలు రాజకీయ స్వార్థం కోసం ూపయోగించుకొని చిల్లర వ్యవహారాలకు పాల్పడ్డాయి. కొన్ని హిందూ సంస్థలు ఆయన్ను బెదిరించడంతో 2006లో ప్రవాసం వెళ్లిపోయారు. 2006 అనంతరం ఆయన భారత పౌరసత్వాన్ని వదులుకొని కతార్‌ పౌరసత్వం స్వీకరించారు. దశాబ్ద కాలం క్రితం కొంత మంది శివసేన గుండాలు ముంబయిలోని ఆయన ఇంటిపై కూడా దాడి చేశారు. హుస్సేన్‌ దేశం విడిచి వెళ్లడంతో స్వదేశంలోనే మరణించాలనే ఆయన కోరిక తీరలేదు. ఒక కళాకారుడిగా ఆయన హక్కులను యుపిఎ సహా భారత ప్రభుత్వాలు కాపాడలేకపోయాయనే విమర్శలు తీవ్రంగా ూన్నాయి. హిందూత్వ ఛాందసవాదుల నుంచి ఒక సృజనాత్మక చిత్రకారునికి రక్షణ కల్పించలేకపోవడం, ఆయన హక్కులను కాపాడలేకపోవటం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌కు ఒక మాయని మచ్చ.
జీవిత చరిత్ర
ఎంఎఫ్‌ హుస్సేన్‌ 1915, సెప్టెంబర్‌ 17న మహారాష్ట్రలోని పండరిపూర్‌లో జన్మించారు. 40వ దశకం ద్వితీయార్ధంలో చిత్రకారుడిగా ఖ్యాతినార్జించారు. 1947లో ఫ్స్రాన్సిస్‌ న్యూటన్‌ సౌజా ప్రోగ్రెసివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూప్‌లో చేరారు. జూరిచ్‌లో 1952లో జరిగిన ఆయన చిత్రాల తొలి ప్రదర్శన ఐరోపా, అమెరికావ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. 1955లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1967లో ఆయన నిర్మించిన 'త్రూ ది ఐస్‌ ఆఫ్‌ ఎ పెయింటర్‌' అన్న చిత్రం బెర్లిన్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి ఆయన బంగారు ఎలుగుబంటు (గోల్డెన్‌ బేర్‌) అవార్డును కూడా గెల్చుకున్నారు. ఆయనకు 1973లో పద్మభూషణ్‌, 1991లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు లభించాయి. 1986లో ఆయన్ను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఎంఎఫ్‌ చిత్రించిన మూడు చిత్రాలు లండన్‌లో జరిగిన ప్రదర్శనలో 2.32 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆయన మరో తైలవర్ణ చిత్రం ఒక్కటే 1.23 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఆయన తన జీవితంలో గజగామిని, మీనాక్షి : టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌' అన్న చిత్రాలను నిర్మించారు. 2008లో దక్షిణాసియా ఆధునిక సమకాలీన చిత్రకళా ప్రదర్శనలో ఎంఎఫ్‌ మహాభారత యుద్ధం ఆధారంగా చిత్రించిన గంగా యమునా పోరు : మహాభారత 12 అన్న చిత్రం రికార్డు స్థాయిలో 16 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లోని రాయల్‌ ఇస్లామిక్‌ స్ట్రేటజిక్‌ స్టడీస్‌ సెంటర్‌ విడుదల చేసిన ప్రపంచంలోని 500 మంది ముస్లిం మేధావుల పేర్లలో ఎంఎఫ్‌ హుస్సేన్‌ పేరు కూడా చోటు చేసుకోవడం విశేషం.