Thursday, September 15, 2011

పేదవారంటే పాలకులకెందుకీ వివక్ష

ఎనకటికి ఎవరో ఎదో అన్నట్లు కోట్లాది రూపాయలను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న బడాబాబులకు క్షమాభిక్ష ప్రసాధించడానికి సిద్దపడ్డ కషాయి కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యుడిని మాత్రం అందినకాడికి పీల్చుకోడానికి కర్కశంగా వ్యవహరిస్తుంది. పెట్రో సంస్థల ఒత్తిడికి తలొగ్గి పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తివేసి మూడోచ్చినప్పుడల్లా రేట్లు పెంచుకోటానికి వారికి విశృంఖల స్వేచ్ఛనిచ్చింది. పేదవారు, సామాన్యులు, మధ్యతరగతి వారంటేనే ఈ ప్రభుత్వానికి చివుక్కుమంటుంది. అందుకే వరుసబెట్టి భారాలు వేస్తుంది. రాయితీపై ఇవ్వాల్సిన గ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను కుదించేందుకు కుట్ర పన్నుతోంది. ద్విచక్ర వాహనం ఉన్నా వారికి రాయితీ ధరపై గ్యాస్‌ అందించకుండా ఉండేందుకు పన్నాగాలు తయారుచేస్తుంది. ఈ రోజుల్లో ద్విచక్ర వాహనం లేకుండా ఎవరైనా ఉంటున్నారు. మూడు నాలుగు వేలు జీతాలొచ్చే మార్కెటింగ్‌ ఉద్యోగం చేయాలన్నా ద్విచక్ర వాహనం తప్పనిసరైన నేపథ్యంలో అప్పోసొప్పో చేసి ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులేదుర్కొంటున్నప్పటికీ ద్విచక్ర వాహనాలు కొనాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి సాకుల కోసం వెతకుతున్న కసాయి పాలకులు ఎప్పుడు దొరుకుతారా అందుకుందాం అని ఎదురుచూస్తున్నారు. అసలు మనిషి రక్తం తాగడం లాంటి ఏమైనా పథకాలుంటే ఈ పాలకులు రోజుకొక్క పేదవాణ్ణి ఇంటికి తీసికెళ్లి అతనిలోని నరనరంలోని రక్తాన్ని చివరిబొట్టు వరకు పీలుస్తారనడంలో ఎవరికైనా సందేహం ఉండకపోవచ్చు. ఇంతటి తీవ్ర విమర్శ చేయడానికి మనసు రాకపోయినా వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఇది చాలా తక్కువేమోనని అనిపిస్తుంది. ఓ పేదవాడు గూడుకోసం ఓ జానెడు చోటు ఇవ్వమంటే లాఠిలతో తరుముతారు. కానీ కార్పొరేట్లకు ఎకరాలకు ఎకరాలు అప్పజెప్పుతారు. ప్రభుత్వ పథకాలను కిందిస్థాయ వరకు తీసుకుపోవడంలో కీలక పాత్రం పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారికి సహకరిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు తీర్చాలనో ఓ వెయ్యి రూపాయలు వేతనాలు పెంచాలనో నిరసన వ్యక్తం చేస్తే వారి గొంతుకలపై తుపాకి కుత్తుకలను పెడుతున్నారు. వేసుకున్న చొక్కా నలగకుండా కూర్చోని ప్రజాసంక్షేమాన్ని తాట్టుపెట్టే చట్టసభల ప్రతినిధులకు మాత్రం లక్షలకు లక్షలు ముట్టజెబుతున్నారు. కామందుల కావరానికి రోజుకొక అబల బలవుతున్నా, ప్రభుత్వ రోడ్ల పుణ్యమాని పదుల సంఖ్యలో ప్రమాధాల బారిన పడి మరణిస్తున్నా పట్టించుకోవడానికి తీరికుండదు. కానీ ఓ ఎంపి కొడుకో, ఎమ్మెల్యే కొడుకో అతి వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి గురయితే మాత్రం అధికార పక్షం, ప్రతిపక్షం అంతా కదులుతుంది. చివరకు నిబందనలు కూడా మారుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిచోటా ఉన్నవారు, లేనివారు అనే బేధాన్ని పాలకులు భాగా ఒంటపట్టించుకుంటున్నారు. ఓటుకు వచ్చిన నాడు చేసిన బాసలను పాతిపెట్టి గెలిపించిన వారి వెన్నులో బాకులు దించుతున్నారు.
ఇంత జరుగుతున్నా కార్పొరేటు మీడియాకు ఇవేమీ పట్టవు. కార్పొరేట్ల మద్దతుతో చేపట్టే దీక్షలకు ఇచ్చే ప్రచారంలో ఒక్క శాతం కూడా పేదల పోరాటాలకు ఇవ్వడానికి వారికి మనసు రాదు. అది భూపోరాటమయినా, అటవీ హక్కుల పోరాటమయినా, ఆఖరికి సొంత భూమని రక్షించుకునే పోరాటమయినా మీడియా దయచూపదు. ఆఖరికి మహిళలపై ఖాకీలు కర్కశత్వానికి పాల్పడుతున్నా ప్రశ్నించదు. ఓ బడాబాబుకు వెన్నుపూసలో శస్త్రచికిత్సలో జరిగినా, బాత్రూంలో జారిపడినా ఓ పది రోజులు అదే ప్రధాన వార్త అవుతుంది. ఇది మన కార్పొరేటు మీడియా నగ్న స్వరూపం.
ఇక తమ నాయకునిపై సిబిఐ విచారణ జరుగుతుందనో, తమకు అడిగిన శాఖా ఇవ్వలేదనో, ఇంకా ఎదో కారణంతో తమ పదవులను తృణపాయంగా వదులుకుంటున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న చట్టసభల ప్రతినిధులు ప్రజల సమస్యలపై మాత్రం బెదిరింపులకు పాల్పడరు. ఎదో ఓ ఖండన ఇవ్వటమో, దిష్టిబొమ్మ తగలబెట్టడమో, లేదంటే కొద్దిసేపు రోడ్డు మీద కుర్చోవడమో చేస్తున్నారు. కానీ చట్టసభల వేదికలపై ఎంతమందిని ప్రజాసమస్యలను లేవనెత్తుతున్నారు? మనదేశ పార్లమెంటులో కనీసం సగం మందికి పైగా ఇంతవరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదంటే మనం ఎటువంటి వారిని సభకు ఎన్నుకోంటున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవినీతి మరక పడని పార్టీలు వీటిపై నిలదీసినా వాటికి మీడియా ప్రచారం మాత్రం రాదు. అసలు అటువంటి సభ్యుల ప్రాతినిధ్యం ఎక్కడ పెరుగుతుందోనని కంగారు కార్పొరేటు మీడియాలో ఎప్పూడూ ఉంటుంది. ఎందుకంటే చిత్తశుద్ది ఉన్న వారంతా మాట్లాడేది విధానాలపై కాబట్టి. అవినీతి వ్యతిరేక ఉద్యమాలు జరిగితే ఆ మీడియా మద్దతునిచ్చింది చిత్తశుద్దితో కాదు. చిత్తశుద్ది ఉన్నట్లయితే విధానాల మార్పుపై మాట మాత్రం మాట్లాడని సామాజిక కార్యకర్తలను ఒక్కమారైనా ప్రశ్నించేవి. ఇన్ని ఆటంకాలను దాటుకొని పేదవారి వేదన ముందుకు ఎలా సాగుతుంది. ఆరణ్య రోదన గానే మిగిలిపోవడం తప్ప. మీడియా కళ్లకు కానరాని, వినరాని పేదల, మధ్యతరగతి ఆవేదనను ఒక్కసారి ఆలోచించాలని ఓ చిన్న విజ్ఞప్తి. ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో ప్రభావితం కానప్పుడు వ్యర్థమేనని గుర్తుంచుకొని ఒక్క సారి ఆలోచించాలని విజ్ఞప్తి.