Saturday, May 19, 2012

సంస్మరణ సరే... ఆచరణ మాటేమిటి?


   కమ్యూనిస్ట్ యోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) మూలపురుషుల్లో ఒకరైన పుచ్చలపల్లి  సుందరయ్య శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజానేతకు స్మరించుకునేందుకు అంతకన్నా ఎక్కువ  చేసిన తప్పు లేదు. ఎందుకంటే వున్నత కుటుంబములో పుట్టినా పేదల కోసం ఉద్యమించారు. మచ్చ లేని నేతగా నిలిచారు. నిస్వార్దంగా సామాన్య జీవితం గడిపారు ఆ మహానేత.
      అయితే శతజయంతి ఉత్సవాల పేరుతో ఆ మహానుభావున్ని స్మరించుకుంటే సరిపోతుందా? అయన చూపించిన మార్గం అవసరం లేదా అనేది నేటి నేతలు ఆలోచించుకోవాలి. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్నా సైకిల్ మీదనే సభకు వెళ్లారు పిఎస్ (సుందరయ్య గారిని ఇష్టంగా పిలుచుకునే పేరు). కాని నేటి ఆ పార్టీ నేతలు అడంబరాలలో భుర్జువా పార్టీల నేతలతో పోటి పడుతున్నారు. ఎసి వాహనాలు లేకుంటే బయట కాలు కూడా పెట్టలేకపోతున్నారు. తమ కింది క్యాడర్ లో కూడా  అటువంటి లక్షణాలు ఉన్నవారిని మాత్రమే నేటి నేతలు గుర్తిస్తున్నారు. బయటి కార్యక్రమాలకు వారితోనే వెళ్తున్నారు. పేద కార్యకర్తల ఇంటివైపు కూడా చూడడం లేదు.  స్వార్ధం పెరుగుతుందేమో అన్న భావనతో సంతానమే వద్దనుకున్నారు పిఎస్. కానీ అయినవారు, తమ ప్రాంతం వారినే అందలమేక్కియడం, వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం నేడు రివాజుగా మారింది. ప్రశ్నించే వారిని కమిట్మెంట్ లేని వారిగా ప్రచారం చేస్తూ, పైపైన తిరుగుతూ పై బాధ్యుల వద్ద చెంచాగిరి చేసేవారిని వీర యోధులుగా గుర్తిస్తున్నారు. పార్టీ, ప్రజాసంఘాలు, అనుబంధ సంస్థలలోనూ ఈ వ్యాది విస్తరించి వుంది. ఉద్యమానికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన వారు తిరిగి కీలక బాధ్యతల్లోకి వస్తున్నారు. ఆర్దికంగా, ఇతర  ఇబ్బందులు ఎదురైనా   దీర్గాకాలంగా ఉద్యమాన్ని అంటిపెట్టుకున్న వారిని చిన్నచూపు చుస్తున్నారనే విమర్శ ప్రతి స్తాయిల్లోను వుందని ఆ సంస్తల్లో పనిచేస్తున్న మిత్రులే స్వయంగా చెబుతున్నారు. అయితే అందరు నేతలు అలానే వున్నారని అనలేము. కాని మెజార్టీ నేతలు మాత్రం కచ్చితంగా అలానే వున్నారు.
       అయితే ప్రస్తుత  రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును ఇందులో  మినహాహింపునివ్వొచ్చు. ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితం గడుపుతారు. అయన మీద ఎన్ని విమర్శలు వున్నా దగ్గర నుండి ఆయనను ఎరిగిన వారికి ఆదర్శ నేతగా నిలుస్తారనడంలో  సందేహం ఉండకపోవచ్చని భావిస్తున్నాను. తరువాతి నేతలు కూడా ఆయన్ను అనుసరిస్తే ఆ మహానుభావుని ఆశయం కొంతైనా నెరవేరుతుంది.
          తమకు చెంచాగిరి చేసే లేదంటే పై స్తాయిల్లో పలుకుబడి ఉన్నవారికే పార్టీలో, ప్రజాసంఘాల్లో, పార్టీ అనుబంధ సంస్త లలో  గుర్తింపు లభిస్తుందని, అటువంటి వారికే పదోన్నతులు లభిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విమర్సలకు మార్క్సిస్టులు ఏనాడు భయపడరు. కనీసం స్పందించరు. పాలకులపై అలుపులేని పోరాటాలు నిర్వహిస్తున్న వారిపై స్వార్ద శక్తులు విమర్శలకు దిగుతున్న నేపద్యంలో ఆ విదానం కరక్టే. కాని వాస్తవ   విమర్శలను పట్టించుకోకపోతే కింది స్తాయి క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారు. తెలిసో, తెలియకో జరుగుతున్న అటువంటి చర్యలపై పై నాయకత్వం ఆరా తీయిస్తే పార్టీకే మంచిది. చివరగా ఒక విజ్ఞప్తి.. ప్రతిభ, కమిట్మెంట్ ఉన్నవారిని గుర్తించకున్నా పెద్ద నష్టం లేదు. కానీ అది లేని వారిని తీసుకవచ్చి కీలక స్తానాల్లో కూర్చోబెట్టడం వల్ల ఆ సంస్థ అభివృద్దికి తీవ్ర ఆటంకంగా నిలుస్తుందని గుర్తించాలి. లేదంటే అంతా అయ్యాక మరోసారి 'దిద్దుబాటు' చేయాల్సి వస్తుంది. ఆ మహనీయుని దార్సనికతను, నాయకత్వ సామర్ధ్యాన్ని కనీసం ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకొని, మహాసభల్లో నిర్ణయించినట్లుగా స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు నాయకత్వం పనిచేయాలి. ఆ పనిలో నాలాంటి వారు ఎప్పుడు నూలు పోగుగా సహాయపడతారు.