Friday, December 28, 2012

యువ చైతన్యం


       దేశ రాజదాని ఢిల్లీలో గత వారం జరిగిన సంఘటన దేశంలో మహిళల దుస్థితి ఎంత దుర్భరంగా ఉందో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వ, రాజ్యాంగ యంత్రాంగాల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీ యువత స్పందన యావత్ దేశాన్ని అబ్బురపరిచింది. ఎప్పుడు పబ్బులు, ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఢిల్లీ యువతరం ఒక సంఘటనపై స్వచ్ఛందంగా రొడ్డెక్కడం, అందునా హై సెక్యూరిటీ జోన్ గా భావించే రాజ్ పథ్, విజయ్ చౌక్, రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో వేలాదిగా గుమిగూడి నిరసనకు దిగడం ఆశ్చర్యం కలిగించింది. వారి ధైర్యానికి, చొరవకు అభినందనలు. సాధారణంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, విజయ్ చౌక్ ప్రాంతాలలో గుంపులు గుంపులుగా ప్రజలను తిరగనివ్వరు. ఢిల్లీలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ ను వదిలి హై సెక్యూరిటీ ప్రాంతాన్ని ఆందోళనకు ఎంచుకోవడం యువతలోని తెగింపును తెలుపుతుంది. వాటర్ కానన్లు, బాష్పవాయువులు అలవాటు లేకున్నా వాటికి భయపడకుండా ఉద్యమకారుల స్పూర్తిని చాటారు. ఇప్పటికైనా పాలకులు యువతలోని ఆగ్రహా జ్వాలలను గుర్తించి, ఆందోళన ఉదృతం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలి. హామీలతో సరిపెట్టకుండా అమలుకు చిత్తశుద్దితో కృషిచేయాలి. మహిళలను తాకాలంటేనే భయపడేలా శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇటువంటి అకృత్యాలకు ఎంతోకొంత బ్రేక్ పడే అవకాశం ఉంది.
      ఇక విచారం కలిగించే విషయం ఏమంటే... ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన మెడి"కో' గురించి ఇక్కడి వైద్యవిద్యార్థులు ఎవరూ స్పందించకపోవడం. మెస్ ఛార్జీల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో విధులు తప్పనిసరిని వ్యతిరేకిస్తూ పేషంట్ల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గాంధీ విద్యార్థులకు ఈ సంఘటన కనిపించలేదా? కనీసం ఖండించేందుకు కూడా మనసు రాలేదు. తమ తోటి వైద్య విద్యార్థినిపై జరిగిన అకృత్యం యావత్ దేశాన్ని ఉడికిస్తుంటే... రాష్ట్ర వైద్య విద్యార్థులు మాత్రం సిగ్గు, శరం లేకుండా తమ పని చూసుకుంటున్నారు.

Friday, December 7, 2012

తెలంగాణ... పేరే కావాలి???

           తెలంగాణ ఐకాన్... వీరవనిత... తెలంగాణ తూర్పుముక్క.... ఇలాంటి మాటలు ఎన్నో.... ఫేస్ బుక్ లో తెలంగాణ వాదుల వీర ఫాలోయింగ్... విపరీతమైన కామెంట్లు... న్యూస్ రీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవార్డులను తొలిసారి అందుకున్న సదరు యాంకర్  అప్పటి వరకు ఎంతమందికి తెలుసో కానీ... అవార్డు వచ్చిన తర్వాత మాత్రం పైన చెప్పిన హంగామాతో తెలంగాణలో ఆమెకు విపరీత ప్రచారం కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లు... టీవీలు, పేపర్లో యాడ్స్... జనాలకు ఇంత వేలం వెర్రి ఎందుకో అర్థం కాలేదు. ఎదో.. స్టేజీ మీద రెండు మాటలు మాట్లాడగానే ఆమెలో కొంతమందికి వీరతెలంగాణం కనిపించింది. తీరా ఇప్పుడు చూస్తే... తెలంగాణవాదం పక్కన పెట్టిన ఆమె రెడ్ల పార్టీలో చేరారు. ఆమెను ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో? తెలంగాణవాదం కన్న కులానికి, ఇతర అంశాలకు ప్రాధాన్యమిచ్చిన ఆ వనిత ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం శోచనీయం. పార్లమెంటులో సమైక్యాంద్ర ప్లకార్డును ప్రదర్శించిన జగన్ పార్టీ సరసన చేరిన ఆమె... తన రాజకీయారంగేట్రం తెలంగాణ కోసమేనంటే నమ్మే వెర్రి వాళ్ళు ఈ తెలంగాణలో ఎవడూ లేరు. ఇంకా నమ్మితే గొర్రే కసాయోన్ని నమ్మినట్లే. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. నిన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇవాళ ఆమె, రేపు ఇంకొకరు... ఇలా అందరూ తెలంగాణ వాదాన్ని వాడుకున్నది.. వాడుకుంటున్నది... తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ కోసం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేయాలన్న పదవి కాంక్ష, ఆర్థిక ప్రయోజనాల కోసం సదరు యాంకర్ తెలంగాణావాదాన్ని తాకట్టు పెట్టారు. రేపు మళ్ళీ తెలంగాణ పేరుతోనే ఓట్లు అడగడానికి లో ఎటువంటి సంకోచం లేకుండా వస్తారు. 
          ఈ విషయాన్ని అమాయకులైన మా తెలంగాణ సోదరులు గుర్తించనంత కాలం ప్రతివాడు తెలంగాణ జెండా ఎత్తుకొని పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఐపిఎస్ గిరిని వదులుకున్నా... అన్నీ సొంత లాభాలకేనన్నది వాస్తవం. గీడ నిజమైన తెలంగాణ వాదులు ప్రజలే.. నాయకులు కాదు.. అందుకే తెలంగాణ పేరుతో పోటీ చేసే వారు ఓడిపోతే తెలంగాణవాదం ఎక్కడ వెనకపడి పోతుందోనన్న ఆందోళనతో వారి పుట్టుపుర్వోత్తరాలు చూడకుండా గెలిపించుతున్నరు. గెలిచిన వారు మాత్రం ప్రజల ఆకాంక్షను పక్కకు పెట్టి ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నరు. ఈ ప్రపంచంలో స్వార్థం లేనివాడు ఎవ్వడూ లేడు. ప్రతివాడికి ఎదో రూపంలో స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే భయటికి మాత్రం వీర ఫోజులు పెట్టడమే బాధాకరం. తెలంగాణ పేరుతో వంచించబడుతోన్న ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలి. ఎవ్వనికిబడితే వాడికి తెలంగాణవాదాన్ని అన్వయించుకోవద్దని మనవి.