Sunday, April 10, 2011

హజారే దీక్ష ముందుకు తెస్తున్న అంశాలు

వి.శ్రీనివాసరావు 
అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు దేశవ్యాపితంగా పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఎస్‌యంఎస్‌లు, సోషల్‌నెట్‌వర్కింగుల ద్వారా ఈ ఉద్యమం మధ్యతరగతి మేధోజీవుల్లోకి వ్యాపిస్తోంది. అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తికి ఈ ఉద్యమం అద్దం పడుతోంది. అనూహ్యమైన ఈ పరిణామంతో పాలకులు కంగుతిన్నారు.
దేశాన్ని అవినీతి వేరుపురుగులాగా పట్టిపీడిస్తోంది. అవినీతి ఒక చీడ. దాని పునాది వేరులోనే ఉంది. వేరు నరక్కుండా చీడనివారణకు ఎన్ని మందులేసినా మరల మరల వస్తూనే ఉంటుంది. ఈ వేర్లు జాతీయ సరిహద్దులకే పరిమితం కాలేదు. అది అంతర్జాతీయకరణ చెందింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం మొదలుకొని ఐపియల్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ వరకు, ఇరవై ఏండ్ల నుండి రావణ కాష్టంలాగా తగలబడుతున్న బోఫోర్స్‌ నుండి యూనియన్‌ కార్చయిడ్‌ వరకు అన్నిటి మూలాలూ విదేశీ సంస్థలతో ముడిపడి ఉన్నవే. ఈ అంతర్జాతీయ దొంగల ముఠానే నేడు రాజ్యం ఏలుతోంది. హజారే సరిగ్గానే విమర్శించినట్లు లోక్‌పాల్‌పై కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలోని పెద్ద మనుషుల్లో కొంతమంది కుత్తుకల వరకు అవినీతిలో కూరుకుపోయినవారే. దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణంలో అవినీతేమీ జరగలేదని బుకాయిస్తున్న కపిల్‌సిబాల్‌, ఐపియల్‌కు నాయకత్వం వహిస్తున్న శరద్‌పవార్‌ లాంటి వారు ఇందులో సభ్యులంటే అవినీతి వ్యతిరేక బిల్లుకు ఏ గతి పడుతుందో సులభంగానే ఊహించవచ్చు. ఇదే శరద్‌పవార్‌ గతంలో బియ్యం, చక్కెర ఎగుమతి కుంభకోణంలో కూడా ఆరోపణలనెదుర్కొన్నారు. అందువల్లనే లోక్‌పాల్‌ బిల్లు కాదు జన్‌లోక్‌పాల్‌ బిల్లు కావాలని, దాని రూపకల్పనలో పౌరసంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నా హజారే దీక్ష చేస్తున్నారు. అంబుడ్స్‌మాన్‌గా వ్యవహరించే లోక్‌పాల్‌ శిక్ష విధించే హక్కుతో సహా సర్వాధికారాలు కలిగిన సర్వసత్తాక సంస్థగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
హజారే దీక్ష అవినీతి సమస్యను జాతీయ అజెండాలోకి తెచ్చింది. ఈ వ్యవస్థలో అవినీతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినా కనీసం అదుపులో ఉంచాలన్నా కట్టుదిట్టమైన చట్టాలు అవసరం. దీనిపై ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ సిద్ధం కాలేదు. 1966లోనే మొరార్జీదేశాయి నాయకత్వంలోని పరిపాలనా సంస్కరణల కమిటీ లోక్‌పాల్‌ కోసం సిఫార్సు చేసింది. 1969లో లోకసభ బిల్లును ఆమోదించినా రాజ్యసభలో పాసవ్వలేదు. అప్పటి నుండి మహిళాబిల్లు లాగానే పలుమార్లు ప్రవేశపెడుతున్నారే తప్ప ఆమోదింపజేయడానికి ఏ ప్రభుత్వమూ చిత్తశుద్దితో కృషి చేయలేదు. ఈ బిల్లులు కూడా చాల లోపభూయిష్టంగా ఉన్నాయి. 2010లో దీనిపై దేశవ్యాపితంగా చర్చ ఆరంభమైన పూర్వరంగంలో అనేక మంది ప్రముఖులు ''అవినీతి వ్యతిరేక భారతదేశం'' అనేపేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులో అన్నా హజారేతోపాటు స్వామి అగ్నివేష్‌, బాబా రాందేవ్‌, శ్రీశ్రీరవిశంకర్‌, కిరణ్‌బేడీ, మేధాపాట్కర్‌ వగైరాలున్నారు. సినిమా రంగానికి చెందిన అమీర్‌ఖాన్‌, శేఖర్‌కమ్ముల కూడా ఉన్నారు. న్యాయకోవిదులు శశిభూషణ్‌, శాంతిభూషణ్‌, కిరణ్‌బేడీ, కర్నాటక లోకాయుక్త సంతోష్‌హెగ్డే వంటి వారు కలసి ఒక నమూనా బిల్లును తయారు చేశారు. ప్రభుత్వానికి దాన్ని అందజేశారు. దానిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడీ ఆందోళన చేపట్టారు. దీక్ష సందర్భంగా హజారే చేస్తున్న ప్రకటనలు, ఉపన్యాసాలు కొన్ని అంశాలను చర్చనీయాంశం చేశాయి. వాటిని పరిశీలించడం అవసరం.
తనకు రాజకీయపార్టీల మద్దతు అవసరం లేదని, ఏ రాజకీయ నాయకుడూ తన వేదికపైకి రాకూడదని ఆయన షరతు విధించారు. తద్వారా వామపక్షాలతో సహా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం జరిగింది. ఇది రాజకీయరహిత సిద్ధాంతం. రాజకీయపార్టీలన్నింటినీ ఒకేగాటన కట్టి రాజకీయ నాయకులంతా అవినీతిపరులే అన్న భావాన్ని ఈ సందర్భంగా వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఉద్యమ విస్తృతిని గాక దాని సంకుచితతత్వాన్నే సూచిస్తుంది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ధి ఉండాలని ప్రపంచీకరణ వాదులు చేసే వాదన లాంటిదే ఇదీనూ. ఈ ఆలోచనలో భాగంగానే ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాదు రాజకీయాలకు అతీతంగా ఉండే పౌరసంఘాలు (వీటినే గతంలో ఎన్‌జీవోలనేవారు) చట్టాలు చేయాలంటున్నారు. ఇది ఒక రకంగా చట్టాలను ఔట్‌ సోర్సింగ్‌ చేయడం లాంటిదే. ప్రజలకు బాధ్యత వహించే పార్టీలు తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే వాటిని శిక్షించే అవకాశం, హక్కు ప్రజలకుంది. అందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి. కాని దానికి బదులుగా ఎన్‌జీవోలు మాత్రమే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పడంలో అర్థం లేదు. ఎన్‌జీవోలు ఎవరికి బాధ్యత వహిస్తాయి? ప్రజలకా? లేక తమకు నిధులు సమకూర్చే సంస్థలకా? ఈ సందర్భంగా హజారే, వారి మద్దతుదారులు కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించాలి.
ఒకటి: గత ముప్పయి నాలుగేండ్లుగా అధికారంలో ఉన్న బెంగాల్‌, ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాలు రాజకీయ అవినీతికి అతీతంగా ఉన్నాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రికి కనీసం బ్యాంకు అకౌంటు కూడా లేదంటే ఆశ్చర్యం వేయదా? ఆయన తనకొచ్చే యావత్‌ జీతభత్యాలను పార్టీకి అప్పగించి పార్టీ నుండి అందరు కార్యకర్తల మాదిరిగానే అలవెన్సు తీసుకుంటున్నారు. అలాంటి రాజకీయ నాయకులను స్వాగతించరా? కేరళ ముఖ్యమంత్రిని అవినీతి వ్యతిరేక పోరాటయోధునిగా ప్రజలు కీర్తిస్తున్నారు. ఆయన్ను కూడా అందరిలాగే అదే గాటన ఎందుకు కడుతున్నారు. అవినీతిపై పోరాడే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలెవరైనా సరే బెంగాల్‌, కేరళలలో వామపక్షాలను ఎన్నుకోమని చెప్పాలి. కాని
హజారే ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న మేధాపాట్కర్‌ లాంటి ఎన్‌జీవో నాయకులు వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నం చేస్తున్నారే ఎందుకోసం? ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చే వారు పరిశుద్ధులనా? నీతివంతంగా ఉండే వామపక్షాలను గద్దె దించాలనుకునే వారు ఏ కోవకు వస్తారు?
రెండో అంశం: ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో డబ్బు పాత్ర ఎలా ఉందో చూస్తున్నాం. బెంగాల్‌, కేరళలలో వామపక్షాలు అతి తక్కువగా ఖర్చు పెడుతున్నాయి. బడా నాయకులు హెలికాప్టర్లలో తిరుగుతున్న వైనాన్ని చూస్తున్నాం. తద్బిన్నంగా వామపక్ష నాయకులు, కార్యకర్తలు కాలినడకతో, జీపుల మీదా ప్రచారం చేస్తున్నారు. దీన్ని గుర్తించరా?
మూడు: ఈ సంస్థ మూలపురుషుల్లో ఒకరుగా ఉన్న బాబా రాందేవ్‌ తాను రాజకీయాల్లోకి వస్తానని, పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. స్వామి అగ్నివేష్‌ కూడా రాజకీయ నాయకుడే. గత ఎన్నికల్లో శ్రీశ్రీరవిశంకర్‌ ఎవరికి సహకరించారో అందరికీ తెలుసు. ఈ దీక్ష దగ్గర పెట్టుకున్న బాడ్జీల మీద నినాదం ''మన్మోహన్‌ మీకు నా ఓటు కావాలంటే జన లోక్‌పాల్‌ బిల్లు వెంటనే తీసుకురా'' అన్నది. అంటే బిల్లు తెస్తే ఓటేస్తాం అనే కదా అర్థం. తీసుకురాకపోతే ఎవరికి ఓటేయమంటారు. ఇది రాజకీయ నినాదం కాదా? రాజకీయపార్టీల జోక్యం వద్దనే పేరుతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధునిగా ఉన్న వామపక్షాలను ఒంటరి చేసి, వారి కృషి గుర్తింపుకు రాకుండా చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా అన్న సందేహాలు రాకమానవు.
నాలుగు: ఈ ఉద్యమానికి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తోంది. మంచిదే. కనీసం ఈ రూపంలోనైనా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తోడ్పడుతున్నారు. కాని గత ఎన్నికల తర్వాత పెయిడ్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. దీనిపై కార్పోరేట్‌ మీడియా సంస్థలు కనీసం స్పందించలేదు. వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి 2జిలో కొందరు జర్నలిస్టులు సైతం అనుమానాస్పద పాత్ర నిర్వహించారు. మంత్రుల నియామకంలో కార్పోరేట్‌ సంస్థలకనుకూలంగా లాబీయింగు చేశారు. ఈ ఉద్యమానికి మద్దతివ్వడం ద్వారా పాప ప్రక్షాళన చేసుకోదలచుకున్నారేమో!. వార్తల్ని డబ్బులకు అమ్ముకోడాన్ని హజారే సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ప్రజా ఉద్యమాలను రాజకీయ రహితం చేయాలనుకోవడంలో మీడియా స్వార్దం ఏమిటి?
ఐదు: పరిశుద్ధులుగా చెప్పుకుంటున్న అనేక పౌరసంఘాలు వాస్తవానికి వాణిజ్యపరంగా నడుస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన మైక్రోఫైనాన్స్‌ సంస్థల భాగోతాన్ని మనం చూశాం. జనాన్ని నిండా ముంచిన ఈ సంస్థలనేకం పేరుకు ఎన్‌జీవోలే. వాటిపై హజారే గళం విప్పరా? అలాంటి వారిని కూడా పౌరసంఘాల పేరుతో చట్టాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేస్తారా?
ఆరు: రాజకీయ, ఆర్దిక విధానాలకు అవినీతి అతీతంగా లేదు. ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మడంలో ఎంత అవినీతి జరిగింది. భూ మాఫియాలు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి? దానికి వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు గళమెత్తితే ఈ ఎన్‌జీవోలు మౌనం వహించాయి. ఢిల్లీ పురవీథుల్లో పెద్దర్యాలీ జరిగితే ఏం జరగనట్టే కార్పోరేట్‌ మీడియా ఆ వార్తల్నే బ్లాక్‌ చేసేసింది. అవినీతిపై వామపక్షాలు దేశవ్యాపితంగా నెలరోజుల క్యాంపెయిన్‌ నడిపితే పట్టించుకోలేదు. పైగా 2జి అవినీతిపై శీతాకాల సమావేశాలను నడవకుండా అడ్డుకున్నందుకు వామపక్షాలపై విరుచుకుపడ్డవారున్నారు. ఎందుకని? ఈ పోరాటం అవినీతికి మూలమైన ప్రైవేటీకరణను బలహీనపరుస్తుంది కాబట్టి. అంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఉదారీకరణ కొనసాగాలి. అవినీతి మాత్రం ఉండకూడదంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాని ప్రపంచీకరణ విధానాల నుండి అవినీతిని వేరు చేసి చూడటంలోనే పొరపాటుంది. హాంగ్‌కాంగ్‌ అంబుడ్స్‌మాన్‌ రిపోర్టు ప్రకారం 65శాతం అవినీతి ప్రైవేటురంగంలోనే నడుస్తోంది. హజారే ఉద్యమానికి మద్దతునిస్తున్న ఒక సంస్థ ఏకంగా ప్రైవేటీకరణ ద్వారానే అవినీతిని నిర్మూలించొచ్చంటూ ప్రచారం ఆరరభించింది కూడా.
నార్వే, స్వీడన్‌్‌ లాంటి స్కాండినేవియన్‌ దేశాల తరహాలో అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థ ఉండాలని అంటున్నారు. కాని బోఫోర్స్‌ కుంభకోణానికి మూలం స్వీడన్‌లోనే ఉందని మరచిపోలేం. అవినీతి అతి తక్కువగా ఉందన్న స్విట్జర్‌లాండ్‌ నల్లడబ్బుకి నిలయంగా ఉందని మనకు తెలుసు. ఇలాంటి దేశాల తరహాలోనే అంబుడ్స్‌మెన్‌ ఉండాలంటున్నారు. ఆ దేశాల్లో అవినీతి సమసిపోయిందని ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆర్థిక ఫోరం లాంటి సంస్థలు నెలకొల్పిన ''ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌'' కితాబునిస్తోంది. అంబుడ్స్‌మెన్‌ ఉన్న ఫిలిఫ్పీన్స్‌లో ఇప్పుడు దానిపైనే వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం నియమించిన అంబుడ్స్‌మెన్‌ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కక్షకట్టి వ్యవహరిస్తోందని ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఇంపీచ్‌మెంట్‌ తీర్మానం పెట్టింది. డిప్యూటీ అంబుడ్స్‌మెన్‌పై ఒక అవినీతి వ్యతిరేక సంస్థ ఆరోపణలు గుప్పిస్తోంది. హాంకాంగ్‌లో ఈ వ్యవస్థ గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది. ఇలా వివిధ దేశాల అనుభవాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దీన్నే సర్వరోగ నివారిణిగా చెప్పడంలో అర్థం లేదు. ఈ అనుభవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కట్టుదిట్టమైన శాసనం తీసుకురావాలి.
ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించనున్న లోక్‌పాల్‌ బిల్లు కరిమింగిన వెలగపండు లాంటిది. దాన్ని మార్చి శక్తివంతమైన బిల్లుకు రూపకల్పన చేయడానికి పౌరసంఘాలకు భాగస్వామ్యం కల్పించాలన్నదే దీక్షచేస్తున్న వారి ప్రధాన డిమాండు. అన్నా హజారే దానికి ఛైర్మన్‌గా ఉండాలని వారు కోరుతున్నారు.. ప్రశాంత్‌భూషణ్‌ లాంటి న్యాయనిపుణులను భాగస్వాముల్ని చేయాలనడంలో తప్పు లేదు. కాని పౌరసంఘాలకే దాన్ని పరిమితం చేయాలనడం సరైంది కాదు. సంప్రదింపుల్లో అందరినీ భాగస్వాముల్ని చేయాలి. అది కూడా రాజకీయ ప్రక్రియలో భాగంగానే జరగాలి తప్ప దానికి అతీతంగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కాదు.
దీక్ష చేస్తున్నవారి డిమాండు కన్నా బలపరుస్తున్న ప్రజల మనోగతం మరింత బలవత్తరంగా ఉంది. అవినీతిపై సమరానికే వారు దీక్షలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజాగ్రహం కట్టుదాటక ముందే పటిష్టమైన, సమగ్రమైన లోక్‌పాల్‌ బిల్లును ప్రభుత్వం ఆమోదించాలి. ఇంకా నానుస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
అయితే శాసనాలతోనే అంతా అయిపోతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. అవినీతికి అతీతంగా ఉండే పార్టీలను, నాయకులను ఆదరించినప్పుడే అది అర్ధవంతమవుతుంది. జన లోక్‌పాల్‌ బిల్లుకు అనుకూలంగా ఉండే పార్టీలకే ఓటేయాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఓటుకి బిల్లు ప్రాతిపదిక కాదు. ఏ పార్టీ అవినీతికి అతీతంగా ఉందో దాన్ని బలపర్చమని కోరాలి. అదే ప్రజల మనోగతం. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారు దానికి అతీతంగా ఉన్న పార్టీలను గెలిపించమని విజ్ఞప్తి చేయాలి. కేరళ, బెంగాల్‌లో అందుకు ముందుకు రావాలి. వామపక్ష ఉద్యమాలను బలపరచుకుంటేనే అవినీతి వ్యతిరేకపోరాటం బలపడుతుంది. అవి బలహీనపడితే అవినీతి కూడా ప్రబలుతుంది. ఈ రెంటినీ విడదీసి చూడటం తప్పు. హజారే ఉద్యమంలో ఉన్న కొన్ని ప్రధాన బలహీనతలివే. ఎన్ని పరిమితులున్నా ఈ ఉద్యమాన్ని స్వాగతించాల్సిందే. అవినీతి వ్యతిరేకపోరాటాన్ని మహా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను అన్నా హజారే దీక్ష ముందుకు తెచ్చింది. అందుకు ఆయన అభినందనీయులు.
(అన్నా హజారే దీక్ష నేపథ్యంలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి.శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం ఇది. వి.శ్రీనివాసరావు గారి అభిప్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. అందుకే వ్యాసాన్ని యథాతధంగా ఇస్తున్నాను. )

Wednesday, April 6, 2011

'సత్యసాయి' దేవుడన్నారే !

ఇప్పుడేమో దేవుడే దిక్కంటున్నారు !!

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక వార్త హాట్‌ హాట్‌గా ప్రచారంలో ూంది. సత్యసాయి ఆరోగ్యం ఆందోళనకరంగా ూందని తెలియడంతో ఆయన భక్తులే కాదు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు... సారీ.. సారీ.. వీళ్లు కూడా ఆయన భక్తులే కదా... సరే వీరంతా తీవ్ర ఆందోళనలో ూన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎనకటికేదో సామెత చెప్పినట్లు మొన్నటి వరకు దేవుడిగా పూజలు అందుకున్న, ప్రచారం పొందిన శ్రీ సత్యసాయిగారు ప్రస్తుతం దేవుణి కరుణ కోసం వేచి చూస్తున్నారని వినికిడి. ఆయన భక్తులు సైతం సత్యసాయికి సెలవు ప్రకటించి(పాపం ఆరోగ్యం బాగాలేనందున సెలవు ఇచ్చారేమో) వేరే దేవుణ్ణి మొక్కుతున్నారట. విది ఎంత విచిత్రం. ఎదో సినిమాలో ఒక డైలాగును గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా ఎంతైనా సముచితమెమో... 'ప్రపంచం చాలా చిన్నది. ఎన్నడో ఒకరోజు నీకు నా అవసరం రాక తప్పదు'.. నిజంగా ఈ డైలాగ్‌ సత్యసాయి(బాబా)కు, ఆయన పరమ భక్తులకు బాగా సరిపోతుంది. అయినా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, దేశ, రాష్ట్ర ప్రధమ పౌరుడు/పౌరురాలిగా ూన్న పలువురు వ్యక్తులు, ూన్నత చదువుల చదివిన అధికారులు సత్యసాయి కాళ్లు మొక్కడం ఎంత వరకు సమంజసమో ఇప్పటికైనా ఆలోచించుకోండి. రామాయణం, మహాభారతం, భాగవతం, ఖురాన్‌, బైబిల్‌ లాంటి ఇతిహాసాల గాధలను అపహస్యం చేయలేం. అలా అని అందరూ నమ్మరు. ఎవరి విశ్వాసాలు వారివి. కానీ ఇలాంటి బాబాల విషయంలోనే ప్రజలు పునరాలోచించుకోవాలి. అయన మీద మాకు ఏలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ చిన్న చిన్న బాబాలు, సత్యసాయికి తేడా ఏమిటి? ఎవరి స్థాయిలో వారు ప్రజలను మోసం చేస్తున్నారు. కాకపోతే తనకొచ్చిన ఆర్థిక, హంగ బలంతో సత్యసాయి పలు కళాశాలలను, ఆసుపత్రులను, సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. రోడ్డు పక్కన ూండే ఏ బాబాకూ కోట్లకు కోట్లు వస్తే వారు కూడా ఎంతో కొంత సేవ చేస్తారు. ముందు ఇలాంటి పెద్ద బాబాలు, తరువాత చిన్న బాబాలు, అటు తరువాత చేతబడి, బాణామతి మంత్రగాళ్లు వీళ్లందరూ వాస్తవం కాదని గుర్తించేందుకు ఇప్పటికైనా మనమందరం ముందుకు వస్తే, మూడ హత్యలను, ఆత్మబలి లను నివారించవచ్చు.
కొంతమంది బాబా భక్తులు తమ దగ్గరకు వస్తుండడంతో ఇతర దేవుళ్లు(బాబాలు) తమ అవసరం ఇప్పుడు తెలిసిందా? అని నవ్వుకుంటున్నారట. పాపం ఆ ఇతర దేవుళ్లు(బాబాలు) ఎన్నడో ఒకరోజు ఇంకో దేవుణ్ణి నమ్ముకోక తప్పదు. చివరికి ఏ దేవుడైనా ప్రాణం మీదకు వచ్చేసరికి ప్రజల దగ్గరికే లఘేత్తుకొస్తాడు. అదే నండి వైద్యశాస్త్రాన్ని చదువుకున్న వైద్యుని వద్దకు....అసలు ఈ దేవుళ్ల పురాణానికి అంతముండదా అంటే ఎందుకుండదు.. మనమంతా మనుషులమని గుర్తించినప్పుడు కచ్చితంగా ూంటుంది...ఏమంటారు... నేనైతే మనిషినే.. నా చుట్టూ ూన్న వారు మనసున్న మనుషులేనని నేను నమ్ముతున్నాను. మరి మీరు????

Tuesday, April 5, 2011

జగన్‌ తంత్రం నెరవేరేనా ?

మొన్నటి వరకు అధికార కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఆ కుటుంబం వైఎస్‌ మరణాంతరం చిన్నాభిన్నం అయింది. అంటే అంతకు ముందు వారి మధ్య మనస్పర్ధలు లేవని కావు. కానీ వైఎస్‌ మరణం తరువాత అప్పటివరకు అణచిపెట్టబడ్డ ఆవేశాలు పెల్లుబుకాయి. తనయున్ని రాహుల్‌ దగ్గర చేర్చాలని తన సోదరున్ని పదవినుండి తప్పించినప్పుడు వచ్చిన అసంతృప్తి, ఆవేశం వైఎస్‌ ప్రభావంతో అణిచివేయబడ్డాయి. తదనంతర పరిణామాలతో దివంగత వైఎస్‌ తనయుడు, కడప పార్లమెంట్‌ మాజీ సభ్యులు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుండి వెలుపలికి వచ్చి సొంత కుంపటి(పార్టీ)ని ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని తద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని ఏలాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన తన తండ్రి లాగా రాజకీయ చదరంగం ఆడకుండా వేగవంతమైన చదరంగం (ర్యాపిడ్‌ చెస్‌)ను ఆడుతున్నారు. రాజకీయాలకు వాస్తవ లెక్కలకు, చదరంగాలకు చాలా తేడాలుంటాయి. ఒక్కోసారి ఉహించిన ఫలితాలు వచ్చినా పరిణామాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. గణితంలో కూడికలు ఎప్పుడు అదనపు విలువలను ఇస్తాయి. కానీ రాజకీయాల్లో అది జరగాలని లేదు. వైఎస్‌ హయాంలో ప్రజల సమస్యలపై నోరు మెదపకుండా ఉండి కాంగ్రెస్‌ పార్టీ నుండి జగన్‌ వెలుపలికి రావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఇట్టే చెప్పెయవచ్చు. కానీ జగన్‌ మాత్రం తన తండ్రి విధానాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించటం లేదని, పేదలకు, విద్యార్ధులకు అన్యాయం చేస్తుందని 'పోరు' చేస్తున్నారు. కాదు కాదు చేస్తున్నట్లు నటిస్తున్నారు అని కూడా విశ్లేషకుల అభిప్రాయం. తన తండ్రి ప్రజలకు ముఖ్యంగా పేదలకు, విద్యార్ధులకు ఎంతో ఉపయెగపడే పనులను చేశారని జగన్‌ తన అనుకరణా ప్రసంగాలలో చెప్తున్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుపైనా, ఉపకారవేతనాలపైనా అదేవిధంగా చెప్పారు. కానీ జగన్‌ ఏ విషయాలపై 'పోరు' చేశాడో అదే విషయాలపై తన తండ్రి హయాంలో జరిగిన పరిణావలకు ప్రజలకు సరియైన సమాధానం చెప్పగలడా? కచ్చితంగా మాత్రం చెప్పలేడు. తండ్రి నుండి వచ్చిన 'ఎదురుదాడి' తప్ప. తన తండ్రి చేసిన పనులకు, కాంగ్రెస్‌ పార్టీకి(ప్రభుత్వానికి) సంబంధం లేదని చెప్తున్న జగన్‌ కాంగ్రెస్‌ దయలేనిదే తన తండ్రి, తాను ఆ స్థాయికి చేరుకున్నట్లు ఆత్మసాక్షిగా చెప్పగలడా? ఇవన్నీ కచ్చితంగా జరగవు. కానీ వీటిపై ఎవరైనా ప్రశ్నించినా, ప్రచురించినా తన చేతిలోని 'ఊకదంపుడు ప్రచార ఆయుధాల'తో ఎదురుదాడి చేయిస్తారు. వాస్తవానికి జగన్‌లాంటి ప్రభావితమైన యువకుడు ప్రస్తుత రాజకీయాలలో అవసరం. కానీ ప్రస్తుత పార్టీలకు భిన్నంగా జగన్‌ వెళ్లటంలేదని ఆయన అనుచరగణం, చేతిలోని ఆయుధాల ఊకదంపుడు ఉపన్యాసాలు, డబ్బా ప్రసంగాలు, పసలేని వాదనలే స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఆయన రాజకీయ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ విషయంలో చిరంజీవికి, జగన్‌కు పెద్ద తేడా కనబడడంలేదు. కాకపోతే చిరంజీవి కన్నా జగన్‌ కొంచెం ఎక్కువ ప్రభావం చూపవచ్చని, ఎందుకంటే ఆయన వెనకాల ఫ్యాక్షన్‌ నీడ ఉందని ప్రచారం.
                అయితే కాంగ్రెస్‌కు, తనకు సంబంధం లేదని చెప్తున్న జగన్‌ మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారా? నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన రాజకీయాలను చేస్తున్నారా? అని అడిగితే మెజార్టీ ప్రజలు కాదనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ విషయంలో ఆయన వైఖరీ స్పష్టం. మామకు వెన్నుపోటు పొడిచిన బాబు అని చంద్రబాబుపై ఇతర పక్షాల చేసే శాశ్వత విమర్శ లాగా తండ్రి శవం పక్కనే సిఎం పీఠం కోసం సంతకాలు చేయించిన కొడుకు అని జగన్‌పై ఒక శాశ్వత విమర్శ ఎప్పటికి వ్యతిరేక పక్షాల నోట నానుతూనే ఉంటుంది. చంద్రబాబు వెన్నుపోటు విమర్శకు అంత బలమైన సాక్ష్యాలు ఏమున్నాయో తెలియదు గాని జగన్‌పై విమర్శకు మాత్రం ఆయన 'ప్రత్యక్ష సాక్షి'లే ఆ రోజున ప్రచారం చేశాయి. ఏది ఏమైనా కడప జిల్లాలో జగన్‌ ప్రభావం పెద్దగా లేదని ఇటీవలే ముగిసిన స్థానిక సంస్థ్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి పులివెందుల అసెంబ్లీతో పాటు ఒక పార్లమెంట్‌ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు జగన్‌కు, ఆయన పార్టీ ప్రస్థానానికి చాలా కీలకమైన మెట్టుగా చెప్పవచ్చు. అయితే తండ్రి అకాల మరణం సానుభూతితో ఈ స్థానాలను గెలుచుకున్నా అదిమాత్రమే సరిపోదు. గెలుపునకు సాధించిన మెజార్టీయే ఇక్కడ ఆయన భవిష్యత్‌ను నిర్ధారిస్తుంది. ఆ మెజార్టీ భారీ ఎత్తున లేకపోయినట్లయితే జగన్‌ నైతికంగా ఓడినట్లే.