Tuesday, October 8, 2013

సీమాంధ్ర మీడియా ఉద్యమం!!

      సమైక్యవాద ఉద్యమం పేరుతో సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పట్ల మన మీడియా వైఖరి చూస్తుంటే సిగ్గేస్తుంది.. మీడియా సంస్థలు మరీ ఇంత దారుణంగా, పక్షపాతంగా వ్యవహరిస్తాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. నేను తెలంగాణలో పుట్టినా నాకు ప్రత్యేక కాంక్ష ఏనాడూ లేదు.. ఒక తెలంగాణ బిడ్డగా మా ప్రాంత ఉద్యమం పట్ల సాధారణ సానుభూతి తప్ప ప్రత్యేక అభిమానం లేదు. నాలో ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్న వామపక్ష భావాజాలం అందుకు కారణం కావచ్చు. కానీ తెలంగాణపై కేంద్రంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సానుకూల ప్రకటన చేసినప్పటి నుంచి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, దాన్ని మీడియా కవర్ చేసే పద్ధతి చూస్తున్నప్పటి నుంచి నాలో తెలంగాణవాదం బలపడుతుంది. నాకే కాదు సీమాంధ్రలోకృత్రిమ ఉద్యమం మొదలయినప్పటి నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమకాంక్ష మరింత బలపడిందనేది వాస్తవం. 
     అయితే ఇన్ని సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులయిన ఉద్యమం ఎప్పుడూ కర్ఫ్యూ వరకు వెళ్ళలేదు. లూటీలు జరగలేదు. కానీ సీమాంధ్రలో ఉద్యమం ముసుగులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, లూటీలకు పాల్పడడం మనం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ దారుణ హత్య, విజయవాడలో కొండవీటి మోహన రంగా హత్య సంఘటనల అనంతరం కూడా ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లూటీలు జరిగాయి.. ఏదైనా అల్లర్లు జరగగానే లూటీలకు పాల్పడడం ఆ ప్రాంతంలో కొంతమందికి అలవాటు లా ఉంది.. ఈ వైఖరి చూస్తే సీమాంధ్ర నేతలు దోపిడిదారులని తెలంగాణ వాదులు చేస్తున్న వాదన నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుంది. 
       అయినా సంవత్సరాల తరబడి జరుగుతున్న ఉద్యమానికి కేంద్రం ఎదో ఒక రూపంలో ముగింపు పలికేందుకు ముందుకు రావడం నాకైతే సంతోషంగానే ఉంది.. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలలో ఏర్పడే ప్రభుత్వాల వైఖరిని బట్టి ఉంటుంది తప్పితే.. విడిపోతే అభివృద్ధి చెందుతాం.. లేదంటే కలిసుంటేనే అభివృద్ధి సాధ్యం లాంటి వాదనలు వాస్తవం కాదనేది నాకున్న నిశ్చితాభిప్రాయం. అందుకే దీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలికేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం, కేబినోట్ లో నోట్ పెట్టడం శుభపరిణామం. అయితే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభం కావడం వెనక రహస్య ఎజెండా ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణపై ఎంతోకాలంగా చర్చ జరుగుతుంటే అప్పుడు నోరుమెదపని వారు తెలంగాణ ప్రకటన వచ్చాక హడావుడి చేయడం ఎంతవరకు సమంజసమో వారే తేల్చుకోవాలి. 
       సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుందని ఊదరగొడుతున్న సీమాంధ్ర మీడియా.. అక్కడి ప్రజల అభిప్రాయాలను మాత్రం ప్రతిభింభించడంలేదని.. అక్కడివారే చెబుతున్నారు. చాలామంది ప్రజలు సమ్మెతో ఇబ్బంది పడుతూ ఉద్యమం మనకేందుకుని నిలదీస్తున్నారట.. కానీ అటువంటి వాటిని ప్రసారం చేయకుండా.. తాము చెప్పిన మాటలనే వల్లెవేసే వారి బైట్లు మాత్రమే ప్లే చేస్తున్నారు. మీడియా తలచుకుంటే తిమ్మినిబమ్మి చేయగలదన్న వాదన నిజమేనని సీమాంధ్ర ఉద్యమాన్ని చూస్తే నిజమేననిపిస్తుంది... మీరేమంటారు?