Sunday, April 10, 2011

హజారే దీక్ష ముందుకు తెస్తున్న అంశాలు

వి.శ్రీనివాసరావు 
అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు దేశవ్యాపితంగా పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఎస్‌యంఎస్‌లు, సోషల్‌నెట్‌వర్కింగుల ద్వారా ఈ ఉద్యమం మధ్యతరగతి మేధోజీవుల్లోకి వ్యాపిస్తోంది. అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తికి ఈ ఉద్యమం అద్దం పడుతోంది. అనూహ్యమైన ఈ పరిణామంతో పాలకులు కంగుతిన్నారు.
దేశాన్ని అవినీతి వేరుపురుగులాగా పట్టిపీడిస్తోంది. అవినీతి ఒక చీడ. దాని పునాది వేరులోనే ఉంది. వేరు నరక్కుండా చీడనివారణకు ఎన్ని మందులేసినా మరల మరల వస్తూనే ఉంటుంది. ఈ వేర్లు జాతీయ సరిహద్దులకే పరిమితం కాలేదు. అది అంతర్జాతీయకరణ చెందింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం మొదలుకొని ఐపియల్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ వరకు, ఇరవై ఏండ్ల నుండి రావణ కాష్టంలాగా తగలబడుతున్న బోఫోర్స్‌ నుండి యూనియన్‌ కార్చయిడ్‌ వరకు అన్నిటి మూలాలూ విదేశీ సంస్థలతో ముడిపడి ఉన్నవే. ఈ అంతర్జాతీయ దొంగల ముఠానే నేడు రాజ్యం ఏలుతోంది. హజారే సరిగ్గానే విమర్శించినట్లు లోక్‌పాల్‌పై కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలోని పెద్ద మనుషుల్లో కొంతమంది కుత్తుకల వరకు అవినీతిలో కూరుకుపోయినవారే. దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణంలో అవినీతేమీ జరగలేదని బుకాయిస్తున్న కపిల్‌సిబాల్‌, ఐపియల్‌కు నాయకత్వం వహిస్తున్న శరద్‌పవార్‌ లాంటి వారు ఇందులో సభ్యులంటే అవినీతి వ్యతిరేక బిల్లుకు ఏ గతి పడుతుందో సులభంగానే ఊహించవచ్చు. ఇదే శరద్‌పవార్‌ గతంలో బియ్యం, చక్కెర ఎగుమతి కుంభకోణంలో కూడా ఆరోపణలనెదుర్కొన్నారు. అందువల్లనే లోక్‌పాల్‌ బిల్లు కాదు జన్‌లోక్‌పాల్‌ బిల్లు కావాలని, దాని రూపకల్పనలో పౌరసంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నా హజారే దీక్ష చేస్తున్నారు. అంబుడ్స్‌మాన్‌గా వ్యవహరించే లోక్‌పాల్‌ శిక్ష విధించే హక్కుతో సహా సర్వాధికారాలు కలిగిన సర్వసత్తాక సంస్థగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
హజారే దీక్ష అవినీతి సమస్యను జాతీయ అజెండాలోకి తెచ్చింది. ఈ వ్యవస్థలో అవినీతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినా కనీసం అదుపులో ఉంచాలన్నా కట్టుదిట్టమైన చట్టాలు అవసరం. దీనిపై ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ సిద్ధం కాలేదు. 1966లోనే మొరార్జీదేశాయి నాయకత్వంలోని పరిపాలనా సంస్కరణల కమిటీ లోక్‌పాల్‌ కోసం సిఫార్సు చేసింది. 1969లో లోకసభ బిల్లును ఆమోదించినా రాజ్యసభలో పాసవ్వలేదు. అప్పటి నుండి మహిళాబిల్లు లాగానే పలుమార్లు ప్రవేశపెడుతున్నారే తప్ప ఆమోదింపజేయడానికి ఏ ప్రభుత్వమూ చిత్తశుద్దితో కృషి చేయలేదు. ఈ బిల్లులు కూడా చాల లోపభూయిష్టంగా ఉన్నాయి. 2010లో దీనిపై దేశవ్యాపితంగా చర్చ ఆరంభమైన పూర్వరంగంలో అనేక మంది ప్రముఖులు ''అవినీతి వ్యతిరేక భారతదేశం'' అనేపేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులో అన్నా హజారేతోపాటు స్వామి అగ్నివేష్‌, బాబా రాందేవ్‌, శ్రీశ్రీరవిశంకర్‌, కిరణ్‌బేడీ, మేధాపాట్కర్‌ వగైరాలున్నారు. సినిమా రంగానికి చెందిన అమీర్‌ఖాన్‌, శేఖర్‌కమ్ముల కూడా ఉన్నారు. న్యాయకోవిదులు శశిభూషణ్‌, శాంతిభూషణ్‌, కిరణ్‌బేడీ, కర్నాటక లోకాయుక్త సంతోష్‌హెగ్డే వంటి వారు కలసి ఒక నమూనా బిల్లును తయారు చేశారు. ప్రభుత్వానికి దాన్ని అందజేశారు. దానిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడీ ఆందోళన చేపట్టారు. దీక్ష సందర్భంగా హజారే చేస్తున్న ప్రకటనలు, ఉపన్యాసాలు కొన్ని అంశాలను చర్చనీయాంశం చేశాయి. వాటిని పరిశీలించడం అవసరం.
తనకు రాజకీయపార్టీల మద్దతు అవసరం లేదని, ఏ రాజకీయ నాయకుడూ తన వేదికపైకి రాకూడదని ఆయన షరతు విధించారు. తద్వారా వామపక్షాలతో సహా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం జరిగింది. ఇది రాజకీయరహిత సిద్ధాంతం. రాజకీయపార్టీలన్నింటినీ ఒకేగాటన కట్టి రాజకీయ నాయకులంతా అవినీతిపరులే అన్న భావాన్ని ఈ సందర్భంగా వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఉద్యమ విస్తృతిని గాక దాని సంకుచితతత్వాన్నే సూచిస్తుంది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ధి ఉండాలని ప్రపంచీకరణ వాదులు చేసే వాదన లాంటిదే ఇదీనూ. ఈ ఆలోచనలో భాగంగానే ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాదు రాజకీయాలకు అతీతంగా ఉండే పౌరసంఘాలు (వీటినే గతంలో ఎన్‌జీవోలనేవారు) చట్టాలు చేయాలంటున్నారు. ఇది ఒక రకంగా చట్టాలను ఔట్‌ సోర్సింగ్‌ చేయడం లాంటిదే. ప్రజలకు బాధ్యత వహించే పార్టీలు తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే వాటిని శిక్షించే అవకాశం, హక్కు ప్రజలకుంది. అందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి. కాని దానికి బదులుగా ఎన్‌జీవోలు మాత్రమే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పడంలో అర్థం లేదు. ఎన్‌జీవోలు ఎవరికి బాధ్యత వహిస్తాయి? ప్రజలకా? లేక తమకు నిధులు సమకూర్చే సంస్థలకా? ఈ సందర్భంగా హజారే, వారి మద్దతుదారులు కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించాలి.
ఒకటి: గత ముప్పయి నాలుగేండ్లుగా అధికారంలో ఉన్న బెంగాల్‌, ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాలు రాజకీయ అవినీతికి అతీతంగా ఉన్నాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రికి కనీసం బ్యాంకు అకౌంటు కూడా లేదంటే ఆశ్చర్యం వేయదా? ఆయన తనకొచ్చే యావత్‌ జీతభత్యాలను పార్టీకి అప్పగించి పార్టీ నుండి అందరు కార్యకర్తల మాదిరిగానే అలవెన్సు తీసుకుంటున్నారు. అలాంటి రాజకీయ నాయకులను స్వాగతించరా? కేరళ ముఖ్యమంత్రిని అవినీతి వ్యతిరేక పోరాటయోధునిగా ప్రజలు కీర్తిస్తున్నారు. ఆయన్ను కూడా అందరిలాగే అదే గాటన ఎందుకు కడుతున్నారు. అవినీతిపై పోరాడే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలెవరైనా సరే బెంగాల్‌, కేరళలలో వామపక్షాలను ఎన్నుకోమని చెప్పాలి. కాని
హజారే ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న మేధాపాట్కర్‌ లాంటి ఎన్‌జీవో నాయకులు వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నం చేస్తున్నారే ఎందుకోసం? ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చే వారు పరిశుద్ధులనా? నీతివంతంగా ఉండే వామపక్షాలను గద్దె దించాలనుకునే వారు ఏ కోవకు వస్తారు?
రెండో అంశం: ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో డబ్బు పాత్ర ఎలా ఉందో చూస్తున్నాం. బెంగాల్‌, కేరళలలో వామపక్షాలు అతి తక్కువగా ఖర్చు పెడుతున్నాయి. బడా నాయకులు హెలికాప్టర్లలో తిరుగుతున్న వైనాన్ని చూస్తున్నాం. తద్బిన్నంగా వామపక్ష నాయకులు, కార్యకర్తలు కాలినడకతో, జీపుల మీదా ప్రచారం చేస్తున్నారు. దీన్ని గుర్తించరా?
మూడు: ఈ సంస్థ మూలపురుషుల్లో ఒకరుగా ఉన్న బాబా రాందేవ్‌ తాను రాజకీయాల్లోకి వస్తానని, పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. స్వామి అగ్నివేష్‌ కూడా రాజకీయ నాయకుడే. గత ఎన్నికల్లో శ్రీశ్రీరవిశంకర్‌ ఎవరికి సహకరించారో అందరికీ తెలుసు. ఈ దీక్ష దగ్గర పెట్టుకున్న బాడ్జీల మీద నినాదం ''మన్మోహన్‌ మీకు నా ఓటు కావాలంటే జన లోక్‌పాల్‌ బిల్లు వెంటనే తీసుకురా'' అన్నది. అంటే బిల్లు తెస్తే ఓటేస్తాం అనే కదా అర్థం. తీసుకురాకపోతే ఎవరికి ఓటేయమంటారు. ఇది రాజకీయ నినాదం కాదా? రాజకీయపార్టీల జోక్యం వద్దనే పేరుతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధునిగా ఉన్న వామపక్షాలను ఒంటరి చేసి, వారి కృషి గుర్తింపుకు రాకుండా చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా అన్న సందేహాలు రాకమానవు.
నాలుగు: ఈ ఉద్యమానికి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తోంది. మంచిదే. కనీసం ఈ రూపంలోనైనా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తోడ్పడుతున్నారు. కాని గత ఎన్నికల తర్వాత పెయిడ్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. దీనిపై కార్పోరేట్‌ మీడియా సంస్థలు కనీసం స్పందించలేదు. వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి 2జిలో కొందరు జర్నలిస్టులు సైతం అనుమానాస్పద పాత్ర నిర్వహించారు. మంత్రుల నియామకంలో కార్పోరేట్‌ సంస్థలకనుకూలంగా లాబీయింగు చేశారు. ఈ ఉద్యమానికి మద్దతివ్వడం ద్వారా పాప ప్రక్షాళన చేసుకోదలచుకున్నారేమో!. వార్తల్ని డబ్బులకు అమ్ముకోడాన్ని హజారే సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ప్రజా ఉద్యమాలను రాజకీయ రహితం చేయాలనుకోవడంలో మీడియా స్వార్దం ఏమిటి?
ఐదు: పరిశుద్ధులుగా చెప్పుకుంటున్న అనేక పౌరసంఘాలు వాస్తవానికి వాణిజ్యపరంగా నడుస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన మైక్రోఫైనాన్స్‌ సంస్థల భాగోతాన్ని మనం చూశాం. జనాన్ని నిండా ముంచిన ఈ సంస్థలనేకం పేరుకు ఎన్‌జీవోలే. వాటిపై హజారే గళం విప్పరా? అలాంటి వారిని కూడా పౌరసంఘాల పేరుతో చట్టాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేస్తారా?
ఆరు: రాజకీయ, ఆర్దిక విధానాలకు అవినీతి అతీతంగా లేదు. ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మడంలో ఎంత అవినీతి జరిగింది. భూ మాఫియాలు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి? దానికి వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు గళమెత్తితే ఈ ఎన్‌జీవోలు మౌనం వహించాయి. ఢిల్లీ పురవీథుల్లో పెద్దర్యాలీ జరిగితే ఏం జరగనట్టే కార్పోరేట్‌ మీడియా ఆ వార్తల్నే బ్లాక్‌ చేసేసింది. అవినీతిపై వామపక్షాలు దేశవ్యాపితంగా నెలరోజుల క్యాంపెయిన్‌ నడిపితే పట్టించుకోలేదు. పైగా 2జి అవినీతిపై శీతాకాల సమావేశాలను నడవకుండా అడ్డుకున్నందుకు వామపక్షాలపై విరుచుకుపడ్డవారున్నారు. ఎందుకని? ఈ పోరాటం అవినీతికి మూలమైన ప్రైవేటీకరణను బలహీనపరుస్తుంది కాబట్టి. అంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఉదారీకరణ కొనసాగాలి. అవినీతి మాత్రం ఉండకూడదంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాని ప్రపంచీకరణ విధానాల నుండి అవినీతిని వేరు చేసి చూడటంలోనే పొరపాటుంది. హాంగ్‌కాంగ్‌ అంబుడ్స్‌మాన్‌ రిపోర్టు ప్రకారం 65శాతం అవినీతి ప్రైవేటురంగంలోనే నడుస్తోంది. హజారే ఉద్యమానికి మద్దతునిస్తున్న ఒక సంస్థ ఏకంగా ప్రైవేటీకరణ ద్వారానే అవినీతిని నిర్మూలించొచ్చంటూ ప్రచారం ఆరరభించింది కూడా.
నార్వే, స్వీడన్‌్‌ లాంటి స్కాండినేవియన్‌ దేశాల తరహాలో అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థ ఉండాలని అంటున్నారు. కాని బోఫోర్స్‌ కుంభకోణానికి మూలం స్వీడన్‌లోనే ఉందని మరచిపోలేం. అవినీతి అతి తక్కువగా ఉందన్న స్విట్జర్‌లాండ్‌ నల్లడబ్బుకి నిలయంగా ఉందని మనకు తెలుసు. ఇలాంటి దేశాల తరహాలోనే అంబుడ్స్‌మెన్‌ ఉండాలంటున్నారు. ఆ దేశాల్లో అవినీతి సమసిపోయిందని ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆర్థిక ఫోరం లాంటి సంస్థలు నెలకొల్పిన ''ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌'' కితాబునిస్తోంది. అంబుడ్స్‌మెన్‌ ఉన్న ఫిలిఫ్పీన్స్‌లో ఇప్పుడు దానిపైనే వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం నియమించిన అంబుడ్స్‌మెన్‌ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కక్షకట్టి వ్యవహరిస్తోందని ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఇంపీచ్‌మెంట్‌ తీర్మానం పెట్టింది. డిప్యూటీ అంబుడ్స్‌మెన్‌పై ఒక అవినీతి వ్యతిరేక సంస్థ ఆరోపణలు గుప్పిస్తోంది. హాంకాంగ్‌లో ఈ వ్యవస్థ గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది. ఇలా వివిధ దేశాల అనుభవాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దీన్నే సర్వరోగ నివారిణిగా చెప్పడంలో అర్థం లేదు. ఈ అనుభవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కట్టుదిట్టమైన శాసనం తీసుకురావాలి.
ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించనున్న లోక్‌పాల్‌ బిల్లు కరిమింగిన వెలగపండు లాంటిది. దాన్ని మార్చి శక్తివంతమైన బిల్లుకు రూపకల్పన చేయడానికి పౌరసంఘాలకు భాగస్వామ్యం కల్పించాలన్నదే దీక్షచేస్తున్న వారి ప్రధాన డిమాండు. అన్నా హజారే దానికి ఛైర్మన్‌గా ఉండాలని వారు కోరుతున్నారు.. ప్రశాంత్‌భూషణ్‌ లాంటి న్యాయనిపుణులను భాగస్వాముల్ని చేయాలనడంలో తప్పు లేదు. కాని పౌరసంఘాలకే దాన్ని పరిమితం చేయాలనడం సరైంది కాదు. సంప్రదింపుల్లో అందరినీ భాగస్వాముల్ని చేయాలి. అది కూడా రాజకీయ ప్రక్రియలో భాగంగానే జరగాలి తప్ప దానికి అతీతంగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కాదు.
దీక్ష చేస్తున్నవారి డిమాండు కన్నా బలపరుస్తున్న ప్రజల మనోగతం మరింత బలవత్తరంగా ఉంది. అవినీతిపై సమరానికే వారు దీక్షలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజాగ్రహం కట్టుదాటక ముందే పటిష్టమైన, సమగ్రమైన లోక్‌పాల్‌ బిల్లును ప్రభుత్వం ఆమోదించాలి. ఇంకా నానుస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
అయితే శాసనాలతోనే అంతా అయిపోతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. అవినీతికి అతీతంగా ఉండే పార్టీలను, నాయకులను ఆదరించినప్పుడే అది అర్ధవంతమవుతుంది. జన లోక్‌పాల్‌ బిల్లుకు అనుకూలంగా ఉండే పార్టీలకే ఓటేయాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఓటుకి బిల్లు ప్రాతిపదిక కాదు. ఏ పార్టీ అవినీతికి అతీతంగా ఉందో దాన్ని బలపర్చమని కోరాలి. అదే ప్రజల మనోగతం. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారు దానికి అతీతంగా ఉన్న పార్టీలను గెలిపించమని విజ్ఞప్తి చేయాలి. కేరళ, బెంగాల్‌లో అందుకు ముందుకు రావాలి. వామపక్ష ఉద్యమాలను బలపరచుకుంటేనే అవినీతి వ్యతిరేకపోరాటం బలపడుతుంది. అవి బలహీనపడితే అవినీతి కూడా ప్రబలుతుంది. ఈ రెంటినీ విడదీసి చూడటం తప్పు. హజారే ఉద్యమంలో ఉన్న కొన్ని ప్రధాన బలహీనతలివే. ఎన్ని పరిమితులున్నా ఈ ఉద్యమాన్ని స్వాగతించాల్సిందే. అవినీతి వ్యతిరేకపోరాటాన్ని మహా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను అన్నా హజారే దీక్ష ముందుకు తెచ్చింది. అందుకు ఆయన అభినందనీయులు.
(అన్నా హజారే దీక్ష నేపథ్యంలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు వి.శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం ఇది. వి.శ్రీనివాసరావు గారి అభిప్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. అందుకే వ్యాసాన్ని యథాతధంగా ఇస్తున్నాను. )

14 comments:

  1. మోహన్ రెడ్డి గారూ,

    కమ్యూనిస్టులు అందరూ నిజాయితీపరులే అనుకుందాం. మరి బెంగాల్ ఎందుకు వెనుకబడి ఉంది? అత్యధిక అక్షరాస్యతతో అలరారే కేరళకి నిధులలేమి ఎందుకు? రెండుచోట్లా ఉన్నది వామపక్ష ప్రభుత్వాలేగా? అమ్మ పెట్టనూ పెట్టదు అడుక్కు తిన్నానివ్వదు అని తెలుగు సామెత. టాటా కార్ల పరిశ్రమ విషయం ఏమయిందో అందరమూ చూశాం. అదే పరిశ్రమ ఇప్పుడు ఎందరు గుజరాతీలకు కూడు పెడుతున్నదో చూస్తున్నాం. వామపక్షాలు, వాటి సిధ్ధాంతాలు అంత పరిశుధ్ధమైనవే అయితే రష్యాలో లెనిన్ విగ్రహం ఎందుకు ముక్కలు అవుతుంది? ఇన్ని వామపక్షాలు అవసరమా? ప్రజలు ఎన్నో పార్టీలు, వాదాలు చూసి చూసి విసిగిపోయారు. అందుకే రాజకీయ నాయకులంటేనే కంపరమెత్తిపోతున్నారు.
    ఇక చెడు అంటారా అది ఎక్కడైనా ఎప్పుడైనా ఉండేదే. దాన్ని దిద్దుకోవటానికి చేసే ఏ ప్రయత్నాన్నయినా స్వాగతించాల్సిందే. వ్యాపారం లేదా వాణిజ్యం అనేది ప్రకృతి ధర్మం. మీకు ఒకటి కావాల్సి ఉంటే మీదగ్గరున్న మరోదాన్ని వదులుకోవాల్సిందే. ప్రజలచేత ఎన్నుకోబడ్డ 'ఏ' ప్రభుత్వమైనా సరే ప్రజలకోసం పని చేయకుంటే ప్రజలు ప్రశ్నించటములో తప్పు లేదు. దీనికి ఇవ్వళ హజారేగారు నాయకత్వం వహించారు...ఱేపు మరొకరు.

    ReplyDelete
  2. అచంగ గారూ, మోహన్రెడ్డిగారూ, ఏ పక్ష సిద్ధాంతాలైనా యథాతథంగా ప్రజలకి ఏమీ ప్రయోజనం చేకూర్చవని ఆల్రెడీ అనుభవమే. ఐతే వ్యాసంలో గమనించవలసిన విషయాలున్నాయి. వాటిమీద దృష్టిపెడితే బాగుంటుంది.

    ReplyDelete
  3. /అవినీతిపై వామపక్షాలు దేశవ్యాపితంగా నెలరోజుల క్యాంపెయిన్‌ నడిపితే పట్టించుకోలేదు./
    వారి మీద జనాలకి వున్న నమ్మకం అలాంటిది. :)

    /తద్వారా వామపక్షాలతో సహా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం జరిగింది. ఇది రాజకీయరహిత సిద్ధాంతం. రాజకీయపార్టీలన్నింటినీ ఒకేగాటన కట్టి రాజకీయ నాయకులంతా అవినీతిపరులే అన్న భావాన్ని ఈ సందర్భంగా వ్యాప్తి చేస్తున్నారు./
    కాదా? వాస్తవమే కదా! వామన పక్షాల చికెన్ నారాయణ కూడా హజారేని చూసి వాతలు పెట్టుకుంటున్నారు మరి.

    / ఇది ఉద్యమ విస్తృతిని గాక దాని సంకుచితతత్వాన్నే సూచిస్తుంది/
    ఓహో హో .. హవిస్సులో మీకూ భాగం కావాలంటారు? అంతేనా! ఏడిచినట్టుంది, వామన పక్షాలు మొన్నటివరకూ ఉపాలో భాగస్వాములు, కాదా? ఇప్పుడు తగుదునమ్మా అని ఉద్యమంలో దూరి పోవడానికి మీ ప్రయత్నాలు సంతోషించాల్సిన విషయమే కాని, క్యూలో రండి.

    విస్తృతమైన జవాబుదారీ లేనితనం కన్నా, రాజకీయ రహిత సంకుచితత్వం మంచిదే, అవసరం కూడా.

    మీ ఉద్దేశ్యాలు మంచివైనప్పుడు ఇందులోనే దూరాలని అనుకోవడమెందుకు? మీదపడకుండా/వాటేసుకోకుండా కూడా దూరంగానే వుంటూ సిద్ధాంతపరంగా మద్దతివ్వవచ్చు. ఎవరొద్దన్నారు?!! :)

    ReplyDelete
  4. @ కొత్తపాళీ గారూ,
    ఇక్కడ శ్రీనివాసరావుగారు, మోహనరెడ్డిగారూ వ్యక్తపరచిన అభిప్రాయాలలో నేను వ్యతిరేకిస్తున్నవాటినే ప్రస్తావించాను. శ్రీనివాసరావుగారు చెప్పిన అనేకానేక అంశాలు (స్వీడన్, హాంగుకాంగ్ అనుభవాలు) అత్యంత పరిశీలనార్హం. ది ౧౧-౦౪-౧౧ నాటి 'ఈనాడు' పత్రికలో వచ్చిన హజారేగారి విలేఖరుల సమావేశం సారాంశం చూడండి. హజారే తదితరులు పౌరసమాజం ప్రతినిథులుగా మాత్రమే వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు, ప్రజాసంఘాల నుంచి వచ్చే ఏ ఆచరణయోగ్యమైన ప్రతిపాదన వచ్చినా వారు ముసాయిదాలో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు.

    ReplyDelete
  5. అచంగ గారు,
    మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. వ్యాసంలో ఎక్కడ కూడా హజారే దీక్షను వ్యతిరెకించలేదే. అన్నీ పార్టీలను, వ్యక్తులను ఒకే గాటన కట్టడం పైనే చర్చ. మీరు కేరళకు నిదుల లేమి ఎందుకన్నారు? అవును ఆదే విషయాన్ని నేను కూడా అడుగుతున్నాను. కేంద్రం ఒక్క కేరళ కే నిదులు ఎందుకు ఇవ్వడం లేదు. దీనిపై ఆ రాష్త్ర ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున అందోళనకు దిగారన్న సంగతి మీకు తెలియదా? ఇక బెంగాల్ గురించి కామెంట్ చేశారు. ఒక్క విషయం స్పస్టంగా చెప్పండి బెంగాల్ వెనకబడి వుందని మీకు ఏ సూచి తెలిపింది. మానవ వనరుల సూచినా? లేక ఇంకెదైన నా? గాలి (ప్రొ అమెరికా మీడియా) వార్తలె మీకు బేసయితే నేను ఏమీ చేయలేను. లెనిన్ విగ్రహం ఎందుకు ముక్కలవుతుంది అన్నారు. విగ్రహం ముక్కలైతే సిద్ధాంతాలు పరిశుధ్ధమైనవి కావన్నదే మీ అభిప్రాయమైతే మన దేశంలొ ఎన్నో సార్లు గాంధీ, అంబెద్కర్ ల విగ్రహాలకు అవమానాలు జరిగాయి. వారి సిద్ధాంతాలు మంచివి కావని మీరు అభిప్రాయపడుతున్నారా? టాటా కార్ల పరిశ్రమ బెంగాలీలకు దక్కకుండ చేసిన ఘనత గాలి వార్తలదే. సరే ఎదో మిమ్ముల్ని అనాలని కాదు. హజారే దీక్షకు అందరూ మద్ధతిచ్చారు పొలం పని చేసుకునే మా అమ్మ లాంటి వాళ్లు, అడ్డా మీద పని కోసం వచ్చే దిన కార్మికులు, రోడ్డు పక్కన వుండే ఇలాంటి వారు చాలామంది తప్ప!! 'సొ వీళ్లంతా అవినీతిపరులు. మద్ధతిచ్చిన వై ఎస్ జగన్, చంద్రబాబు, ఎడ్యూరప్ప, మాయావతి, జయలలిత, చిరంజీవి ఇంకా చెప్పుకుంటూ పొతే అందరూ.... సామాన్యులు తప్ప !!! వ్యాసం లో చర్చించింది అదే . వాస్తవాన్ని చూడు వామ పక్షాల మీద వున్న వ్యతిరేఖత ఇక్కడ పక్కకు పెట్టు. మీకు చెప్పటానికి ఇంకా చాలా వున్నాయి. కాని అసందర్భం.

    ReplyDelete
  6. /ఒక్క విషయం స్పస్టంగా చెప్పండి బెంగాల్ వెనకబడి వుందని మీకు ఏ సూచి తెలిపింది. మానవ వనరుల సూచినా? లేక ఇంకెదైన నా? /

    "The four states are - Jammu and Kashmir, Bihar, Madhya Pradesh and Uttar Pradesh.

    The next rung of "Very Highly Corrupt" states include Karnataka - which was ranked 17th in a 2005 Transparency International India survey - Rajasthan as well as Tamil Nadu.

    Not as notorious but still "Highly Corrupt" are the five states of Chhatisgarh, Delhi, Gujarat, Jharkhand, Kerala and Orissa.

    Meanwhile, Andhra Pradesh, Haryana, Himachal Pradesh, Maharashtra, Punjab, Uttarakhand and West Bengal are the "Moderately Corrupt" states of India.

    The survey is a part of efforts by Transparency International India to reduce corruption by promoting and supporting transparent and ethical practices in the Government sector. "

    - http://ibnlive.in.com/news/how-corrupt-is-your-state-read-this-report/72592-3.html

    ReplyDelete
  7. The social activist was right in keeping all political parties at bay from the movement. Had he allowed, the politicians would have politicised and hijacked the movement to their favour. But he never stopped the parties from supporting the cause.

    I feel main opposition parties should have representation in the committee. But the proposal should not come from the activists, but from the govt. When buffoons like Kapil Saibal can be there why not CPM/BJP?

    ReplyDelete
  8. snkr గారూ,

    నేను వెతుకున్న సమాచారాన్ని మీరే అందించారు. ధన్యవాదాలు. కమ్యునిస్టులు ఇతరులను వ్యతిరేకించేటప్పుడు సాధారణంగా వాడే మాట 'బూర్జువా'. కానీ అది తమకి కూడా వర్తిస్తుందని ఒప్పుకోరు.

    మోహనరెడ్డిగారూ,
    ఇక్కడ నేను మరేదో రాజకీయ పక్షానికి వత్తాసు పలకటం లేదు. అలాగే నా భుజాలు అంతకన్నా తడుముకోవటములేదు. సకల సచ్ఛీల బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఊకదంపుడుకీ, ఓ మతతత్వవాది చేతలకీ పొంతన ఎక్కడుంది?
    ప్రపంచములో ఏ మంచి జరిగినా అది కమ్యునిస్టుల చలువ. ఏ చెడు జరిగినా అది బూర్జువా పార్టీల చలువ ఇదే పిడివాదం. గుజరాతులో మోడీకి, బీహారులో నితీశుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే వారి చేతలను బట్టి వారి సిధ్ధాంతాలు చూసిగాదు.
    కమ్యునిజం పుట్టిల్లయిన రష్యాలో దాని పరిస్థితి ఎలా ఉందో యూరోపులో ఉంటున్న నాకు బాగా తెలుసు.

    ReplyDelete
  9. :) /సాధారణంగా వాడే మాట 'బూర్జువా'. కానీ అది తమకి కూడా వర్తిస్తుందని ఒప్పుకోరు./
    ఒప్పుకుంటే వీళ్ళు వర్గ శత్రువులైపోరూ? 'ఆ రిపోర్ట్లన్నీ అమెరికా తొత్తులు/సామ్రాజ్యవాదులు చేసిన కుట్రా సమాధానం వస్తుంది చూస్తూవుండండి. ఆ విషయం నాకూ తెలుసు, ఏదో సిస్టం అలానే వుందా ఏమైనా మారిందా అని టెస్ట్ చేద్దామని, రిపోర్ట్ వెతికి పడేశా. గప్..చుప్.. :)

    ReplyDelete
  10. -------------------------------
    హజారే దీక్షకు అందరూ మద్ధతిచ్చారు పొలం పని చేసుకునే మా అమ్మ లాంటి వాళ్లు, అడ్డా మీద పని కోసం వచ్చే దిన కార్మికులు, రోడ్డు పక్కన వుండే ఇలాంటి వారు చాలామంది తప్ప!! 'సొ వీళ్లంతా అవినీతిపరులు. మద్ధతిచ్చిన వై ఎస్ జగన్, చంద్రబాబు, ఎడ్యూరప్ప, మాయావతి, జయలలిత, చిరంజీవి ఇంకా చెప్పుకుంటూ పొతే అందరూ.... సామాన్యులు తప్ప !!

    -------------------------------------
    చక్కగా చెప్పారు.

    ReplyDelete
  11. వ్యాసం బాగుంది .చర్చించిన పద్దతిలో హేతు బద్దత ఉన్నప్పటికీ కొన్ని విషయాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి .బెంగాల్లో వామ పక్షాలే కాదు ఇతర పార్టీ ల నాయకుల్లో కూడా నిజాయితి పరులే కీలక స్థానాల్లో ఉన్నారు .మమత బనెర్జీ simplicity,honesty విషయంలో బుద్ధ దేవ్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది .బుద్ధదేవ్ కాస్త మంచి చెప్పులు ,బట్టలు వేసుకొంటాడు .ఖరీదైన సిగరేట్టు కాలుస్తాడు.మమత ముతక చీర కట్టుకొంటుంది.హవాయి స్లిప్పర్స్ వేసుకొంటుంది .రేకుల ఇంట్లో ఉంటుంది .ప్రణబ్ ముఖేర్జీ కూడా అవి నీతి పరుడేమి కాదు .ఆయన కూడా simple మనిషే .అలా అని బెంగాల్లో రాజకీయాల్లో అవినీతి లేదని చెప్పటం ప్రజలను తప్పు దోవ పట్టించడం అవుతుంది .బెంగాల్లో జరిగినంత organized corruption బహుశ ఇంకా ఎ రాష్ట్రం లో జరగదేమో .మిగితా చోట్ల నాయకులూ అధికారులు తీసుకొంటే ఇక్కడ పార్టీ తీసుకొంటుంది .అయితే ఇక్కడ advantage ఏమంటే పార్టీ అనేది అనేక స్థాయిల్లో అనేక వ్యక్తులతో ఉంటుంది కాబట్టి అవినీతి ,అభివృద్ధి వికేంద్రికరణ జరుగుతుంది .అయితే పెద్ద నాయకులు ఎందుకు honest అనే సందేహం మనకు కలగవచ్చు .దీనికి సమాధానం honesty is glamarous in bengal అంటారు బెంగాలి మిత్రులు .భారత దేశం లో ఇప్పుడున్న పరిస్తుతుల్లో ఎ పార్టీ అయినా ఎ సంఘం అయినా నైతికత విషయం లో ఏదో ఒక విధంగా compromise అవ్వకుండా ,అది అవినీతి కావచ్చు ఇంకొకటి కావొచ్చు ,మనుగడ సాధిస్తున్నాయనటం అతిశయోక్తి అవుతుంది .
    సచేతనమైన civil society organizations భారత దేశం లో ఏమైనా ఉన్నాయంటే ,భారతీయ సమాజ ప్రజాస్వామీకరణ ప్రక్రియను వేగ వంతం చేస్తున్నవి ఏమైనా ఉన్నాయంటే ,అవి దళిత సంఘాలు ,మహిళా సంఘాలు ,bc సంఘాలు ,గిరిజన సంఘాలు .కాని ఇప్పుడు గడ బిడ చేస్తున్న పగటి వేషగాళ్ళు వాటిని విస్మరించారు .మీరు ఈ విషయాన్నీ మీ వ్యాసం లో చర్చిస్తే బాగుండేది .

    ReplyDelete
  12. @SNKR Garu
    United Nations Development Programme(UNDP)

    First West Bengal Human Development Report Launched

    Gains in Human Development, Human Security But Still A Long Way to Go: Report

    Kolkata, 19 May 2004 : West Bengal has been successful in bringing down both birth rates and death rates, with one of the most rapid declines in birth rate in India. Life expectancy in the State is well above the national average. The sex ratio in West Bengal has shown improvement in recent times, so that it is now just above the national average, while the 0-6 years sex ratio is much higher than the all-India average. West Bengal has a much better record of ensuring the lives of girl infants than India as a whole. These are some of the highlights of the first State Human Development Report for West Bengal that was released by the State Chief Minister, Mr Buddhadev Bhattacharjee, here today.

    http://www.undp.org.in/First_West_Bengal_Human_Development_Report_Launched

    ReplyDelete
  13. Mohan Reddy garu,
    Thanks for the info.

    Looks like a good achievement! Would you please explain:
    1) Is that unique to leftist ruled states?
    2) How to relate that to present burning topic of CORRUPTION?
    3) How can you say by tilting sex ratio( with govt efforts- say) towards males/females state free of corruption can be achieved?
    Thanks!

    ReplyDelete
  14. @Snkr/అచంగ...
    Buddhadeb Bhattacharjee steered West Bengal to 4th position in industrial growth

    24 May, 2011, 1241 hrs IST, Pradeep Thakur, TNN
    NEW DELHI: West Bengal chief minister Mamata Banerjee may have complained of inheriting empty coffers from the Left Front government that ruled the state for 34 years, but cold statistics reveals that it created a base for her to build upon.

    During the last few years of the Left rule, Bengal witnessed rapid industrialization. Former chief minister Buddhadeb Bhattacharjee steered the state to fourth position in terms of rapid growth of industry even better than highly industrialized Gujarat and Andhra.

    ReplyDelete