Tuesday, April 5, 2011

జగన్‌ తంత్రం నెరవేరేనా ?

మొన్నటి వరకు అధికార కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఆ కుటుంబం వైఎస్‌ మరణాంతరం చిన్నాభిన్నం అయింది. అంటే అంతకు ముందు వారి మధ్య మనస్పర్ధలు లేవని కావు. కానీ వైఎస్‌ మరణం తరువాత అప్పటివరకు అణచిపెట్టబడ్డ ఆవేశాలు పెల్లుబుకాయి. తనయున్ని రాహుల్‌ దగ్గర చేర్చాలని తన సోదరున్ని పదవినుండి తప్పించినప్పుడు వచ్చిన అసంతృప్తి, ఆవేశం వైఎస్‌ ప్రభావంతో అణిచివేయబడ్డాయి. తదనంతర పరిణామాలతో దివంగత వైఎస్‌ తనయుడు, కడప పార్లమెంట్‌ మాజీ సభ్యులు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుండి వెలుపలికి వచ్చి సొంత కుంపటి(పార్టీ)ని ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని తద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని ఏలాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన తన తండ్రి లాగా రాజకీయ చదరంగం ఆడకుండా వేగవంతమైన చదరంగం (ర్యాపిడ్‌ చెస్‌)ను ఆడుతున్నారు. రాజకీయాలకు వాస్తవ లెక్కలకు, చదరంగాలకు చాలా తేడాలుంటాయి. ఒక్కోసారి ఉహించిన ఫలితాలు వచ్చినా పరిణామాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. గణితంలో కూడికలు ఎప్పుడు అదనపు విలువలను ఇస్తాయి. కానీ రాజకీయాల్లో అది జరగాలని లేదు. వైఎస్‌ హయాంలో ప్రజల సమస్యలపై నోరు మెదపకుండా ఉండి కాంగ్రెస్‌ పార్టీ నుండి జగన్‌ వెలుపలికి రావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఇట్టే చెప్పెయవచ్చు. కానీ జగన్‌ మాత్రం తన తండ్రి విధానాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించటం లేదని, పేదలకు, విద్యార్ధులకు అన్యాయం చేస్తుందని 'పోరు' చేస్తున్నారు. కాదు కాదు చేస్తున్నట్లు నటిస్తున్నారు అని కూడా విశ్లేషకుల అభిప్రాయం. తన తండ్రి ప్రజలకు ముఖ్యంగా పేదలకు, విద్యార్ధులకు ఎంతో ఉపయెగపడే పనులను చేశారని జగన్‌ తన అనుకరణా ప్రసంగాలలో చెప్తున్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుపైనా, ఉపకారవేతనాలపైనా అదేవిధంగా చెప్పారు. కానీ జగన్‌ ఏ విషయాలపై 'పోరు' చేశాడో అదే విషయాలపై తన తండ్రి హయాంలో జరిగిన పరిణావలకు ప్రజలకు సరియైన సమాధానం చెప్పగలడా? కచ్చితంగా మాత్రం చెప్పలేడు. తండ్రి నుండి వచ్చిన 'ఎదురుదాడి' తప్ప. తన తండ్రి చేసిన పనులకు, కాంగ్రెస్‌ పార్టీకి(ప్రభుత్వానికి) సంబంధం లేదని చెప్తున్న జగన్‌ కాంగ్రెస్‌ దయలేనిదే తన తండ్రి, తాను ఆ స్థాయికి చేరుకున్నట్లు ఆత్మసాక్షిగా చెప్పగలడా? ఇవన్నీ కచ్చితంగా జరగవు. కానీ వీటిపై ఎవరైనా ప్రశ్నించినా, ప్రచురించినా తన చేతిలోని 'ఊకదంపుడు ప్రచార ఆయుధాల'తో ఎదురుదాడి చేయిస్తారు. వాస్తవానికి జగన్‌లాంటి ప్రభావితమైన యువకుడు ప్రస్తుత రాజకీయాలలో అవసరం. కానీ ప్రస్తుత పార్టీలకు భిన్నంగా జగన్‌ వెళ్లటంలేదని ఆయన అనుచరగణం, చేతిలోని ఆయుధాల ఊకదంపుడు ఉపన్యాసాలు, డబ్బా ప్రసంగాలు, పసలేని వాదనలే స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఆయన రాజకీయ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఈ విషయంలో చిరంజీవికి, జగన్‌కు పెద్ద తేడా కనబడడంలేదు. కాకపోతే చిరంజీవి కన్నా జగన్‌ కొంచెం ఎక్కువ ప్రభావం చూపవచ్చని, ఎందుకంటే ఆయన వెనకాల ఫ్యాక్షన్‌ నీడ ఉందని ప్రచారం.
                అయితే కాంగ్రెస్‌కు, తనకు సంబంధం లేదని చెప్తున్న జగన్‌ మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారా? నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన రాజకీయాలను చేస్తున్నారా? అని అడిగితే మెజార్టీ ప్రజలు కాదనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ విషయంలో ఆయన వైఖరీ స్పష్టం. మామకు వెన్నుపోటు పొడిచిన బాబు అని చంద్రబాబుపై ఇతర పక్షాల చేసే శాశ్వత విమర్శ లాగా తండ్రి శవం పక్కనే సిఎం పీఠం కోసం సంతకాలు చేయించిన కొడుకు అని జగన్‌పై ఒక శాశ్వత విమర్శ ఎప్పటికి వ్యతిరేక పక్షాల నోట నానుతూనే ఉంటుంది. చంద్రబాబు వెన్నుపోటు విమర్శకు అంత బలమైన సాక్ష్యాలు ఏమున్నాయో తెలియదు గాని జగన్‌పై విమర్శకు మాత్రం ఆయన 'ప్రత్యక్ష సాక్షి'లే ఆ రోజున ప్రచారం చేశాయి. ఏది ఏమైనా కడప జిల్లాలో జగన్‌ ప్రభావం పెద్దగా లేదని ఇటీవలే ముగిసిన స్థానిక సంస్థ్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి పులివెందుల అసెంబ్లీతో పాటు ఒక పార్లమెంట్‌ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు జగన్‌కు, ఆయన పార్టీ ప్రస్థానానికి చాలా కీలకమైన మెట్టుగా చెప్పవచ్చు. అయితే తండ్రి అకాల మరణం సానుభూతితో ఈ స్థానాలను గెలుచుకున్నా అదిమాత్రమే సరిపోదు. గెలుపునకు సాధించిన మెజార్టీయే ఇక్కడ ఆయన భవిష్యత్‌ను నిర్ధారిస్తుంది. ఆ మెజార్టీ భారీ ఎత్తున లేకపోయినట్లయితే జగన్‌ నైతికంగా ఓడినట్లే.

No comments:

Post a Comment