Friday, December 28, 2012

యువ చైతన్యం


       దేశ రాజదాని ఢిల్లీలో గత వారం జరిగిన సంఘటన దేశంలో మహిళల దుస్థితి ఎంత దుర్భరంగా ఉందో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వ, రాజ్యాంగ యంత్రాంగాల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీ యువత స్పందన యావత్ దేశాన్ని అబ్బురపరిచింది. ఎప్పుడు పబ్బులు, ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఢిల్లీ యువతరం ఒక సంఘటనపై స్వచ్ఛందంగా రొడ్డెక్కడం, అందునా హై సెక్యూరిటీ జోన్ గా భావించే రాజ్ పథ్, విజయ్ చౌక్, రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో వేలాదిగా గుమిగూడి నిరసనకు దిగడం ఆశ్చర్యం కలిగించింది. వారి ధైర్యానికి, చొరవకు అభినందనలు. సాధారణంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, విజయ్ చౌక్ ప్రాంతాలలో గుంపులు గుంపులుగా ప్రజలను తిరగనివ్వరు. ఢిల్లీలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ ను వదిలి హై సెక్యూరిటీ ప్రాంతాన్ని ఆందోళనకు ఎంచుకోవడం యువతలోని తెగింపును తెలుపుతుంది. వాటర్ కానన్లు, బాష్పవాయువులు అలవాటు లేకున్నా వాటికి భయపడకుండా ఉద్యమకారుల స్పూర్తిని చాటారు. ఇప్పటికైనా పాలకులు యువతలోని ఆగ్రహా జ్వాలలను గుర్తించి, ఆందోళన ఉదృతం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలి. హామీలతో సరిపెట్టకుండా అమలుకు చిత్తశుద్దితో కృషిచేయాలి. మహిళలను తాకాలంటేనే భయపడేలా శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇటువంటి అకృత్యాలకు ఎంతోకొంత బ్రేక్ పడే అవకాశం ఉంది.
      ఇక విచారం కలిగించే విషయం ఏమంటే... ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన మెడి"కో' గురించి ఇక్కడి వైద్యవిద్యార్థులు ఎవరూ స్పందించకపోవడం. మెస్ ఛార్జీల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో విధులు తప్పనిసరిని వ్యతిరేకిస్తూ పేషంట్ల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గాంధీ విద్యార్థులకు ఈ సంఘటన కనిపించలేదా? కనీసం ఖండించేందుకు కూడా మనసు రాలేదు. తమ తోటి వైద్య విద్యార్థినిపై జరిగిన అకృత్యం యావత్ దేశాన్ని ఉడికిస్తుంటే... రాష్ట్ర వైద్య విద్యార్థులు మాత్రం సిగ్గు, శరం లేకుండా తమ పని చూసుకుంటున్నారు.

No comments:

Post a Comment